అమరావతే రాజధాని: వైసీపీ పాలన ఆశుభాలతో, కూల్చివేతలతో; ప్రజలు అప్పులఊబిలో: పవన్ కళ్యాణ్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగాన్ని సభకు వచ్చిన లక్షలాదిమంది ఆసక్తిగా పవన్ ప్రసంగంపై దృష్టి సారించారు. అటు రాజకీయ వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ సభ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాయి.

చీకట్లోకి వెళుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది: పవన్ కళ్యాణ్
సభలో ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. చీకట్లోకి వెళుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పవన్ కళ్యాణ్ సభా వేదికగా వెల్లడించారు. ప్రశ్నించే పార్టీ అని తేలిగ్గా తీసుకోవద్దు అంటూ పేర్కొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే అది జనసైనికుల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. ప్రశ్నించడం అంటే పోరాటం చేయాలని, బలమైన రాజ్య స్థాపనకు వీర సైనికుల తరహాలో పోరాడాలని, మీ ప్రాణాలకు మా ప్రాణాన్ని అడ్డు వేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024 సంవత్సరం వరకు గట్టిగా నిలదొక్కుకుంటాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసైనికులు కొదమ సింహాలై గర్జించాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

వైసీపీ సర్కార్ పాలన ఆశుభాలతో , కూల్చివేతలతో మొదలు పెట్టారు
జగన్ స్వచ్ఛమైన పాలన అందిస్తారని ఆశించామని, కానీ అలాంటి పాలన రాష్ట్రంలో లేదని పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. వైసిపి నాయకులు, మంత్రులు అంటే తనకు ఏ విధమైన కోపం లేదని, రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసిపి పాలసీ పైన విభేదాలే తప్ప వ్యక్తిగతంగా తాను దాడి చేయబోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ సర్కార్ పాలన ఆశుభాలతో , కూల్చివేతలతో మొదలు పెట్టారని వైసిపి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని ఆశిస్తే అలా జరగలేదన్నారు పవన్ కళ్యాణ్.

రాష్ట్రం అప్పులపాలు, గజం జాగా కనిపిస్తే కబ్జా : పవన్ ఫైర్
అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు ఇసుక పాలసీ తో మూడు లక్షల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, 32 మంది కార్మికులను వైసిపి బలిగొన్నది అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసం పూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గజం ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ స్పూర్తిని విస్మరించి పాలన సాగిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సీఎంలు మారితే పాలసీలు మారవు.. రాజధాని అమరావతే
ముఖ్యమంత్రి మారితే రాష్ట్రంలో పాలసీలు మారవని పేర్కొన్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్రెడ్డి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు .అమరావతి రాజధాని కోసం ప్రతిపక్షంలో ఉండి ఒప్పుకొని అధికారంలోకి రాగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు గాడిదలు కాశారా అంటూ ప్రశ్నించారు. మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాక రాజధాని మారుస్తాం అంటే కుదరదని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గా ఉండి తీరుతుందని పవన్ కళ్యాణ్ సభా వేదిక గా ప్రకటించారు. అమరావతి రాజధాని రైతుల పై పడ్డ ప్రతి లాఠీ దెబ్బ తనపై పడ్డట్టే అని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను కూడా వైసిపి తప్పు పడుతోందని, న్యాయవ్యవస్థను తిట్టే హక్కు నాయకులకు లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications