మోతే!: కెసిఆర్ ముడుపు విప్పారు (పిక్చర్స్)
నిజామాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో కట్టిన ముడుపును విప్పడానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు జిల్లాలోని మోతే గ్రామానికి వెళ్ళారు. అర్చకుల వేద మంత్రాల మధ్య ముడుపు విప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగించారు. మోతే తెలంగాణకు స్పూర్తి ఇచ్చిన గ్రామమని అన్నారు. ఈ గ్రామం ఎన్నో పల్లెలకు ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. ఉద్యమాన్ని గుండెలకు హత్తుకున్న గ్రామం మోతే అని ఆయన కొనియాడారు.
తాను బతికి ఉన్నంత కాలం మోతే నా స్వంత గ్రామమని, మోతేలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. మోతేకు గోదావరి నీళ్లు తెప్పిస్తానని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్లకు పక్కా ఇల్లు కట్టిస్తామని, రైతులకు లక్ష రూపాయల రుణ మాపీ చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కావాలంటే తమ పార్టీకే ఓటేసీ గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ఫాంహౌస్ నుంచే నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రచారం కోసం పార్టీ అద్దెకు తీసుకున్న హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఫాంహౌస్‌కు వచ్చిన కెసిఆర్ శుక్రవారం ఫాంహౌస్ నుంచి మోతె గ్రామానికి వెళ్లారు.

ముడుపు విప్పిన కెసిఆర్..
తెలంగాణ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజామాబాద్ జిల్లాలో కెసిఆర్ 2001లో ముడుపు కట్టారు. తెలంగాణ వస్తే ముడుపు విప్పుతానని చెప్పారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య..
అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కెసిఆర్ మోతే గ్రామంలో ముడుపు విప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి తమను గెలిపించాలని ప్రజలను కోరారు.

మోతే స్వంత గ్రామం..
తాను బతికి ఉన్నం కాలం మోతేను తన స్వగ్రామంగా చూసుకుంటానని కెసిఆర్ చెప్పారు. ఇక్కడ పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

మోతే గ్రామంలో ఇలా.
మోతే గ్రామం తెలంగాణలోని గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందని కెసిఆర్ అన్నారు. మోతేకు గోదావరి నీళ్లు తెప్పిస్తానని హామీ ఇచ్చారు.

బోనాలతో స్వాగతం
కెసిఆర్ రాక సందర్భంగా గ్రామస్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని బోనాలు, బతుకమ్మలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

తెరాసలోకి కాంగ్రెసు ఎమ్మెల్యే
మల్కాజిగిరి కాంగ్రెసు శాసనసభ్యుడు ఆకుల రాజేందర్ కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. గులాబీ కండువా కప్పి రాజేందర్‌ను కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications