ఏపీలో కాలికి జియో ట్యాగ్ ఉన్న పావురం కలకలం.. చైనా గూఢచర్యంపై అనుమానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబ్బరు జియో ట్యాగ్ వేసిన ఓ పావురం కలకలం సృష్టించింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ అపార్ట్మెంట్లో నాగరాజు అనే యువకుడు కాలికి జియో ట్యాగ్ ఉన్న పావురాన్ని గమనించాడు. పావురం కాలికి చైనా అక్షరాలతో రబ్బర్ ట్యాగ్ ఉన్నట్టుగా గుర్తించిన నాగరాజు అనుమానంతో స్థానిక వీఆర్వోకు పోలీసులకు సమాచారం అందించాడు. పావురం కాలికి రబ్బర్ ట్యాగ్ ఉండడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కాలికి రబ్బర్ ట్యాగ్ తో పావురం
ప్రకాశం జిల్లా చీమకుర్తి లో ఓ అపార్ట్మెంట్ లో నివాసముండే నాగరాజు ఇంటికి తరచుగా పావురాలు వస్తుంటాయి. చీమకుర్తి శివారులో ఉన్న నాగరాజు నివాసముంటున్న బహుళ అంతస్తుల భవనం పైకి వచ్చి గత రెండు నెలలుగా ఉంటున్న పావురం కాలికి జియో ట్యాగ్ ఉంది . ఈ క్రమంలో నాగరాజు నిన్న ఓడిశాలో ట్యాగ్ లు ఉన్న పావురాలను పట్టుకోవటంతో అనుమానం వచ్చి పోలీసులకు, వీఆర్వో కు సమాచారం అందించగా వీఆర్వో సంఘటనా స్థలానికి చేరుకుని పావురాన్ని పరిశీలించారు.

చైనా పంపిన గూఢచర్యమా.. అన్న అనుమానం
పసుపు రంగు కోడ్ నెంబర్ కలిగి ఉన్న పావురాన్ని గుర్తించిన వీఆర్వో, పోలీసు అధికారులు కోడ్ నెంబర్ ఉండడం వల్ల చైనా పంపిన గూఢచర్యం అని అనుమానంతో పావురాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. చీమకుర్తి లో దొరికిన పావురం కాలిపై AIR 2019 2207 అని రాసి ఉంది. ఎవరికీ అర్థం కాకుండా కోడ్ నెంబర్లతో చైనా గూఢచర్యం నడుపుతోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగు నెలల క్రితం కూడా జియో ట్యాగ్ తో ఓ పావురం
ఇది ఇలా ఉంటే సరిగ్గా 4 నెలల క్రితం తిరుపతి నుంచి కడప కు వచ్చే మార్గంలో కూడా అతనికి ఇలాంటి ట్యాగ్ లు వేసుకున్న పావురం కనిపించినట్టు చెబుతున్నాడు. దీన్ని ఒక కాలికి LOFT 26, రెండో కాలి పై LOFT 26 2021 అని రాసి ఉందని ఆ యువకుడు వెల్లడించారు . అయితే ఆ కోడ్ గురించి పట్టించుకోకుండా, అక్కడ అందరూ పావురానికి ఆహారం వేసేవారని, డిసెంబర్ నెలలో ఆ పావురం మృతి చెందిందని యువకుడు పేర్కొన్నారు.

ఒడిశాలోనూ పావురాల కాళ్ళకు జియో ట్యాగ్ ల కలకలం
ఇదిలా ఉంటే ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో స్థానికులకు చిక్కిన కొన్ని పావురాలు కలకలం రేపుతున్నాయి. కోడ్ నెంబర్ లతో కూడిన జియో ట్యాగులు పావురాల కాళ్లకు ఉండడంతో పోలీసులు వెంటనే వీటిపై దృష్టి సారించారు. సోమవారం రవు ర్కెల్లా ప్రాంతంలో ఒకటి, కేంద్రపడ జిల్లా మార్ నగై పోలీస్ స్టేషన్ పరిధిలోని దశరధ పూర్ లో మరొక పావురం మంగళవారం నాడు సంచలనం సృష్టించాయి. దీనిపై వి హెచ్ ఎఫ్, వైజాగ్, 19742021 అని ముద్రించి ఉంది. అనుమానంతో పోలీసులు పావురాన్ని తీసుకెళ్లి, దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
పావురాలకు జియో ట్యాగింగ్ కోడ్ లపై ఆరా ..
ఇక సోమవారం నాడు పురి జిల్లా హరేకృష్ణ పూర్ పంచాయతీలోని రహంగిరియా గ్రామస్తులకు సోమవారంనాడు దొరికిన పావురం కాలికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం ట్యాగ్ లభించింది. మరో కాలికి 37 అంకెతో కూడిన ట్యాగ్ లభించాయి. దీంతో పోలీసులు పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ పావురాలు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎవరు పంపించారు? ఎవరైనా గూఢచర్యం కోసం వీటిని ఉపయోగిస్తున్నారా ? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది చైనా కుట్ర అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications