ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ అరెస్ట్..: ఆ కేసులో అనూహ్య పరిణామం
Varra Ravindra Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు బీ రాఘవ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ మధ్యాహ్నం పులివెందులలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
వైఎస్ఆర్సీపీ నాయకుడు, సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్ర రెడ్డి కేసులో రాఘవ రెడ్డిని పోలీసులు నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ఆయనకు ఇదివరకే నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాఘవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలను విన్న అనంతరం హైకోర్టు- ఈ పిటీషన్‌ను కొట్టివేసింది.

దీనతో పులివెందుల పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. త్వరలో న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో వర్రా రవీంద్ర రెడ్డి కేసులో రాఘవరెడ్డిని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం రవీంద్ర రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు.
చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో వర్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సోషల్ మీడియా కార్యకర్తలు సుబ్బారెడ్డి, ఉదయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వారిలో రవీంద్ర రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతపై పోస్టులు పెట్టినట్లు అంగీకరించాలని పోలీసులు తనను తీవ్ర ఒత్తిడి చేసినట్లు వర్రా రవీంద్రా రెడ్డి గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications