ఏపీ, తెలంగాణాలలో మారిన పొలిటికల్ ట్రెండ్: గతానికి భిన్నంగా.. ప్రజల్లో హాట్ డిస్కషన్!!
తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ ట్రెండ్ మారిందా? ఒకప్పుడు ఎన్నికలు వస్తేనే కనిపించే రాజకీయ పార్టీల నేతలు, ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రజాక్షేత్రంలో కనిపిస్తున్నారా? ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ నిత్యం పోరాటం చేస్తున్నారా? ప్రజల మద్దతు కూడగట్టడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారా?అంటే అవుననే సమాధానమే వస్తోంది.

గతానికి భిన్నంగా మారిన పొలిటికల్ ట్రెండ్
గతానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకప్పుడు ఎన్నికలు దగ్గర పడిన తర్వాతే ప్రజాక్షేత్రంలో కనిపించే నేతలు, ఇప్పుడు ఎన్నికలకు రెండు, మూడు సంవత్సరాల ముందు నుండే ప్రజల మద్దతు కూడగట్టడానికి శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల దగ్గరకు వెళితే ప్రజల మద్దతు లభించదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల తీరు బాగా మారినట్టుగా కనిపిస్తుంది. పొలిటికల్ ట్రెండ్ చేంజ్ పై ఇప్పుడు అన్ని వర్గాలు చర్చిస్తున్నాయి.

ఏపీలో ఇప్పటి నుండే ప్రజా క్షేత్రంలోకి పార్టీలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ టుడే బాదుడు కార్యక్రమంతో ముందుకు వెళుతుంటే, అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గడపగడపకు మన ప్రభుత్వం, బస్సు యాత్ర పేరుతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇక బీజేపీ ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటాలు, ధర్నాలు చేస్తుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నమొన్నటిదాకా కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేశారు.

ఎన్నికలకు రెండేళ్ళ సమయం.. ఇప్పటి నుండే పొలిటికల్ హీట్
ప్రజల్లోనే ఉండాలి అనుకుంటున్న నేతలు, ప్రజల ఆశీర్వాదం కోసం, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా ఎవరికి వారు ముందుకు వెళుతున్నారు. అంటే ఎన్నికలకు రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ నేతల తీరుతో ఏపీ ప్రజలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక నేతల మాటలు, ఇస్తున్న హామీలు, ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేస్తున్న విధానం ఎన్నికల హీట్ ను ఇప్పటినుండే పెంచుతుంది.

తెలంగాణాలో మళ్ళీ అధికారం కోసం టీఆర్ఎస్ ప్లాన్స్ .. కేటీఆర్ జిల్లాల పర్యటనలు
ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఇక ఈ దఫా ఎలాగైనా గెలవాలని భావిస్తున్న అధికార టీఆర్ఎస్ ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెడుతూ జిల్లాల పర్యటన చేపట్టింది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ వివిధ జిల్లాలో పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. మూడోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం గతంలో లేని విధంగా వ్యూహాత్మకంగా ఇప్పటి నుండే ముందుకు వెళ్తున్నారు.

పోటాపోటీగా జనాల్లోకి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్టీపీ
మరోపక్క బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రలు చేస్తూ, గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ పల్లెపల్లెకూ కాంగ్రెస్ పేరుతో పర్యటనలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రలు చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ముందస్తుగా నేతలు ప్రజల వద్దకు పరుగులు పెడుతున్నారు.

గతంలో ఎన్నికలప్పుడే నేతల దర్శనం .. ఇప్పుడు అందుకు భిన్నం: ప్రజల్లో చర్చ
గతంలో కేవలం ఎన్నికల సమయంలోనే గడపగడపకు వెళుతూ ఓట్ల కోసం నానా కష్టాలు పడేవారు రాజకీయ పార్టీల నేతలు. అయితే ఎన్నికలకు మొదటినుంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళితే విజయం తథ్యం అని భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీల నేతలు, అందుకే ముందస్తుగా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లడం మొదలు పెట్టారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజా మద్దతు కోసం రాజకీయ పార్టీల నేతలు పడుతున్న తిప్పలు రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.గతంలో ఎన్నికలప్పుడే నేతల దర్శనం జరిగేదని, కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది. ఎన్నికల కోసమే ఇప్పటినుండి నేతలు పడరాని పాట్లు పడుతున్నారని ఏపీ, తెలంగాణ ప్రజల్లో హాట్ డిస్కషన్ కొనసాగుతుంది.