స్వీట్ న్యూస్: కాకినాడ కాజాకు, మాడుగుల హల్వాకు అరుదైన గుర్తింపునిచ్చిన తపాలా శాఖ
దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కాకినాడ కాజా కు, మాడుగుల హల్వాకు అరుదైన గుర్తింపు లభించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాకినాడ కాజా కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. అటువంటి కాకినాడ కాజాను నేటి తరం గుర్తించడానికి ప్రత్యేక పోస్టల్ కవర్ ను తపాలా శాఖ విడుదల చేసింది. గతంలో కాకినాడ కాజా తో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. అరుదైన గౌరవాన్ని ఇచ్చి స్వీట్ న్యూస్ చెప్పింది తపాలా శాఖ.

కాకినాడ కాజాకు ఖండాంతరాలు దాటిన ఖ్యాతి
కాకినాడ కోటయ్య కాజా కు ఇప్పటికే ఖండాంతరాలు దాటి ఖ్యాతి ఉంది. దేశ విదేశాల్లో ఉండే వారు చాలామంది కాకినాడ కాజా తినాలని కోరుకుంటారు. స్వీట్స్ ఇష్టపడే వారైతే కాకినాడ కాజాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక కాకినాడ కాజా లో మొదట గుర్తొచ్చేది కోటయ్య కాజానే. అందుకే పోస్టల్ శాఖ కోటయ్య కాజా లకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ఆ పేరుతో పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసింది గతేడాది కూడా ఇదే తరహాలో కాకినాడ గొట్టం కాజా లకు పోస్టల్ కవర్ ను విడుదల చేసింది తపాలా శాఖ.

కాకినాడ గొట్టం కాజా కు ప్రత్యేక పోస్టల్ కవరు విడుదల
ఇక కాకినాడ గొట్టంకాజా విషయానికి వస్తే 1981 లో తొలిసారిగా కోటయ్య అనే వ్యక్తి ఈ గొట్టం కాజాను తయారు చేశారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించే అంతర్జాతీయంగా మరింత ప్రచారం కల్పించింది. అటువంటి కాకినాడ గొట్టం కాజా కు ప్రత్యేక పోస్టల్ కవరు విడుదల చేయడం ద్వారా గొట్టం కాజా చరిత్రను తపాలాశాఖ నేటితరం తెలుసుకునే విధంగా చేసింది. కాకినాడ కాజా తో పాటుగా మాడుగుల హల్వా విశిష్టత సైతం పోస్టల్ కవర్ ద్వారా తపాలశాఖ వెలుగులోకి తెచ్చింది.

పోస్టల్ కవర్ పై మాడుగుల హల్వా
విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలి సారి తయారు చేసే హల్వా కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మాడుగుల వాసులు తయారు చేసే ఈ రకమైన హల్వా కు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉందని అంతర్జాతీయంగా కూడా ప్రచారం జరిగింది. గోధుమ పాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి వాటితో మాడుగుల వాసులు తయారుచేసిన ఈ రుచికరమైన హల్వా కూడా తపాలా శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ల పై ఉండటంతో మాడుగుల హల్వా పై కూడా నేటి తరం తెలుసుకునే అవకాశం కల్పించింది.












Click it and Unblock the Notifications