Ramoji rao: జగన్ వేధింపుల మనోవేదనతోనే.. రామోజీరావు మృతి
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, ప్రముఖ నిర్మాత, మీడియా మొఘల్ రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, రేవంత్ రెడ్డి తడుతరులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా, ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
రామోజీ మృతికి జగన్ కారణం: నట్టి కుమార్ సంచలనం
ఇక రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు, తెలుగు చిత్ర పరిశ్రమకు, మీడియాకు రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు మృతికి ఏపీలోని గత ప్రభుత్వం, వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలే కారణమంటూ నట్టి కుమార్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

రామోజీ గొప్పతనాన్ని చెప్పిన నిర్మాత నట్టి కుమార్
రామోజీరావు ఎంతోమందికి సినిమాలలో ఎదిగేందుకు అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్న ఆయన తాను నిర్మాతగా తొలినాళ్లలో గణేష్ హీరోగా తీసిన సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేశానని, చిన్న సినిమాలైనా సరే ఆదరణ చూపిన వ్యక్తి రామోజీ రావు అని నట్టి కుమార్ వెల్లడించారు. అటు మీడియాలోనూ రామోజీరావు రాణించిన తీరును, నిజాయితీగా వార్తలు అందించిన విధానాన్ని, ప్రజలలో ఆయన నింపిన చైతన్య స్ఫూర్తిని నట్టి కుమార్ వివరించారు.
జగన్ కారణంగా రామోజీ రావు మనోవేదన
ఇదే సమయంలో అటు సినీ ప్రపంచాన, మీడియాలోనూ ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగారని, రామోజీరావు మరణానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా కొంతకాలం ఆయన మన మధ్యలో ఉండే వారేనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో ఆయనపై జగన్ మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ప్రతీకార చర్యలతోనే ఆయన మనోవేదనకు గురయ్యారని నట్టి కుమార్ పేర్కొన్నారు.

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాతే ఆయన మనశ్శాంతిగా కన్నుమూశారు
జగన్ వేధింపుల కారణంగా రామోజీ ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, అరాచక పాలన అంతమైంది అని వార్తలు చూసుకున్న తర్వాతనే ఆయన మనశ్శాంతిగా తుది శ్వాస విడిచారని నట్టి కుమార్ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications