రాప్తాడు రంపం కేసు: హేమంత్ కాళ్లు కట్? 3 బుల్లెట్లు అక్కడే
అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. టెన్త్ క్లాస్ చదువుతున్న గోపిక అనే విద్యార్థిని తరగతి గదిలో ఉండగా, వరుసకు బాబాయ్ అయ్యే హేమంత్ అనే ఉన్మాది ఎలక్ట్రిక్ రంపంతో లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలవ్వడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
ఈ క్రమంలో ఆమెను కాపాడేందుకు ధైర్యంగా అడ్డువచ్చిన లక్ష్మి అనే మరో విద్యార్థినిపై కూడా దాడి చేయడంతో ఆమె రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రాక్షసకాండతో మిగతా పిల్లల కేకలు వేయడంతో నిందితుడు రంపాన్ని అక్కడే పడేసి పరారయ్యాడు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
అడవిలో పోలీసు వేట.. ఎదురుదాడికి దిగిన నిందితుడు!
ఈ అమానుష ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్ దాక్కున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని చుట్టుముట్టారు. ఆ సమయములో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ సీఐపై దాడికి దిగాడు. ఈ దాడిలో సీఐ చేతికి తీవ్ర గాయమవడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.

కాళ్లలో 3 బుల్లెట్లు.. కాళ్లు తొలగించే అవకాశం?
పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్‌ను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని కాళ్లలో మూడు బుల్లెట్లు దిగబడటంతో పాటు ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. విపరీతంగా రక్తం పోవడంతో వైద్యులు నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించి, ఆక్సిజన్ అందిస్తూ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, కాళ్లకు అయిన తీవ్ర గాయాల వల్ల నిందితుడి కాళ్లను తొలగించాల్సి రావచ్చునని వైద్యులు చెబుతున్నారు. స్కానింగ్ పూర్తి చేసిన తర్వాతే తదుపరి చికిత్సపై స్పష్టత వస్తుందన్నారు.
విషయం తెలిసిన వెంటనే అనంతపురం ఎస్పీ జగదీశ్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, శాంతిభద్రతల దృష్ట్యా అనంతపురం జీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.














Click it and Unblock the Notifications
