టెన్షన్ పెంచుతున్న పోలింగ్ సరళి- ఎక్కడ ఎవరికి అడ్వాంటేజ్..!?
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మొత్తం 60.96 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిర్యాదుల మేరకు 12 కేంద్రాల్లో ఈ రోజు రీపోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే, పోలింగ్ సరళి పైన పార్టీలు ఫలితాల పై అంచనాలు వేస్తున్నాయి. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని కూటమి.. ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందని వైసీపీ విశ్లేషిస్తోంది. దీంతో.. ఎక్కడ ఎవరికి ఏ మేర కలిసి వస్తుందనే అంచనాలు ఆసక్తిగా మారుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. 12 కేంద్రాల్లో మాత్రమే రీ పోలింగ్ ఈ రోజు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొదలైంది. కార్పోరేషన్లలో తక్కువగా.. మున్సిపాల్టీల్లో ఎక్కువగా పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పోరేషన్లు.. 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ ముగిసింది. తిరుపతిలో అత్యల్పంగా 46.85 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. గ్రేటర్ విశాఖలో 50 శాతం, గుంటూరు కార్పొరేషన్లో 56.15 శాతం, విజయవాడలోనూ 55.35 శాతమే పోలింగ్ నమోదు కావటంతో పార్టీల్లో పోలింగ్ సరళి పైన చర్చ మొదలైంది. 20 జిల్లాల్లోని మున్సి పాలిటీల్లో 60 శాతం పైగా పోలింగ్ జరిగినా.. 2024 అసెంబ్లీ ఎన్నికలతో (81.87శాతం ఓటింగ్) పోలిస్తే తక్కువగా నమోదైంది. పులివెందులలో 70.56 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా.. ఏడు మున్సిపాలిటీల్లో 80 శాతంపైగా పోలింగ్ జరిగింది.

పార్టీల్లో పెరుగుతున్న అంచనాలు
కాగా.. మొత్తంగా 60.96 శాతం పోలింగ్ జరిగింది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62.28 శాతం పోలింగ్ నమోదైంది. ఇక.. పోలింగ్ సరళి పైన కూటమి.. వైసీపీ నేతలు ఒక అంచనాకు వస్తున్నారు. కార్పోరేషన్లలో కర్నూలు, అనంతపురం, విజయనగరం పోలింగ్ పైన వైసీపీ నేతలు తమకు అనుకూలత కనిపించిందని విశ్లేషణలు చేస్తున్నారు. సీమ ప్రాంతంలోని పలు మున్సిపాల్టీల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అయితే, కూటమి నేతలు ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని.. కూటమి అన్ని స్థానాల్లో గెలవటం ఖాయమని ధీమాగా కనిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో రెబల్స్.. పోలింగ్ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో అక్కడ ఫలితం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విజయవాడ, గుంటూరు లో కూటమి మేయర్ అభ్యర్ధులకు భారీ మెజార్టీ ఖాయమని విశ్లేషిస్తున్నారు. విశాఖలో మాత్రం వరుదు కల్యాణి గట్టి పోటి ఇచ్చారనే వాదన బలం గా వినిపిస్తోంది. దీంతో.. రేపు (మంగళవారం) జరిగే కౌంటింగ్ పైన ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications
