పవన్ పై రెక్కీలో వాస్తవమెంత ? జనసేన డిమాండ్లపై కేంద్రం, బీజేపీ మౌనం- టార్గెట్ వైసీపీయేనా !
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకంచేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ పై తాజాగా రెక్కీ జరిగిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పవన్ ను అంతమొందించేందుకు కుట్ర జరిగిందని జనసేన ఆరోపిస్తోంది. అయితే పవన్ ను అంతం చేయడానికి కుట్ర చేసిందెవరు ? దీనిపై జనసేన అప్పుడే ఫిర్యాదు ఎందుకుచేయలేదు ? చేసినా బీజేపీ పట్టించుకోలేదా ? ఇప్పుడు జనసేన బయటపడినా బీజేపీ, కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటున్నాయి ? ఇదంతా వైసీపీని టార్గెట్ చేసే మైండ్ గేమేనా ? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే..

పవన్ కళ్యాణ్ పై రెక్కీలో నిజమెంత ?
ఏపీలో అధికార వైసీపీ అధినేత జగన్, విపక్ష టీడీపీ బాస్ చంద్రబాబు కంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫోకస్ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అధికార పీఠంపై కూర్చునే వారి లెక్కల్ని మార్చే దిశగా ఆయన వేస్తున్న అడుగులే. అయితే ఈ అడుగులు సవ్యదిశలోనే ఉన్నాయా లేదా అనేది కాలం చెప్పాల్సి ఉంది. ఆలోపు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నేతలు మైండ్ గేమ్ పాలిటిక్స్ ను నమ్ముకుంటున్నారు. విశాఖలో పవన్ పై దాడి జరగకపోయినా జరిగినట్లు ఆరోపించిన జనసేన నేతలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హత్యకు రెక్కీ జరిగిందంటూ మరో కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చారు. దీంతో ఇందులో నిజానిజాలపై చర్చ జరుగుతోంది. దీన్ని ఇంకా ఎవరూ నిర్ధారించకపోవడంతో ప్రస్తుతానికి ఇది ఆరోపణ మాత్రమే.

రెక్కీ ఆరోపణల వెనుక ?
విశాఖ నుంచి పవన్ తిరిగి వచ్చాక హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటివద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుండటం, వారు పవన్ ఇంటి ముందు కారు ఆపి పవన్ ను తిడుతూ, సెక్యూరిటీతో గొడవపడటాన్ని రెక్కీకి ప్రధాన ఆధారాలుగా జనసేన చెబుతోంది. వీటినే వీడియో తీసి జనసేన నేతలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కడప నేతలే కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు కడప నేతలే అనేందుకు ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనుక వాస్తవాల్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

జనసేన ఆరోపణలపై కేంద్రం, బీజేపీ మౌనం
కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా జనసేన ఉంది. విశాఖ ఘటనల తర్వాత తాము పవన్ తోనే ఉన్నామని ప్రతిరోజూ బీజేపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. జనసేనతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమకు ఇతర పార్టీల పొత్తులు అవసరం లేదని తేల్చేశారు. కానీ ఇప్పుడు అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రెక్కీ జరిగిందని తెలిసి కేంద్రం కానీ, బీజేపీ నేతలు కానీ స్పందించడం లేదు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకు సైతం వై కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు పవన్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై స్పందించి అదనపు భద్రత కేటాయించే ఆలోచనే చేయడం లేదు. అదే సమయంలో పవన్ పార్టీ నేతలు కూడా కేంద్రం గురించి మాట్లాడకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు.

వైసీపీ టార్గెట్ గా మైండ్ గేమ్ ?
పవన్ కళ్యాణ్ పై రెక్కీ అంటూ జనసేన నేతలు చేస్తున్న ఆరోపణల్ని లోతుగా తరలిచూస్తే ఇందులో ఆయన్ను ఫాలో అవుతున్న వ్యక్తులు, ఆయన ఇంటిముందు గొడవ మినహాయిస్తే ఇతర ఆధారాలేవీ లేవు. కానీ గతంలో కడప జిల్లా సిద్ధవటంలోనూ పవన్ హత్యకు కుట్ర జరిగిందంటూ జనసేన ఆరోపిస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ లో పవన్ సెక్యురిటీతో గొడవ పడిన వారు కడప వ్యక్తులంటూ ఆరోపిస్తోంది. దీంతో ఇదంతా వైసీపీ టార్గెట్ గా జనసేన మొదలుపెట్టిన మైండ్ గేమ్ గానే కనిపిస్తోంది. దీని వెనుక ఉన్నది టీడీపీయేనని వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు మొదలుపెట్టేశారు. వీరి ఆరోపణలు ఎలా ఉన్నా గతంలో వంగవీటి రాధా విషయంలోనూ ఇలాగే రెక్కీ ఆరోపణలు వచ్చినా ఏమీ తేలకపోవడం, ఇప్పుడు పవన్ పై రెక్కీ ఆరోపణలు కేవలం ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి.












Click it and Unblock the Notifications