ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..! విద్యుత్ కనెక్షన్లపై కీలక ఆదేశాలు..!
ఏపీలో రైతులకు (farmers) కూటమి సర్కార్ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సమస్యకు పరిష్కారం లభించబోతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ ఉన్నాయి. వీటి ఏర్పాటుకు ఇవాళ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిని వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా వీటికి అనుమతులు జారీ చేయాలని కింది స్ధాయి సిబ్బందిని ఆదేశించింది. ఈ 46113 పెండింగ్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.250 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు నిధుల్ని కూడా విడుదల చేస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 22.3 లక్ష వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. వీటికి తోడు తాజాగా మంజూరు చేసిన 1.12 లక్షల కనెక్షన్లు, ఇప్పుడు పెండింగ్ లో ఉండి క్లియర్ చేసిన 46113 కనెక్షన్లకు కూడా ఉచిత విద్యుత్ అందాల్సి ఉంది. వీటి కోసం 10 వేల ట్రాన్స్ ఫార్మర్లను కేటాయిస్తోంది. దీంతో రెండు నెలల్లో ఈ కనెక్షన్లు ఇచ్చేలా డిస్కంలకు ఆదేశాలు ఇచ్చింది. వేసవి లోపు ఈ కేటాయింపులు పూర్తయితే వచ్చే ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు నీటి లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications