వైఎస్ వివేకా హత్య కేసు-సీబీఐ ఆఫీసర్లకు బెదిరింపులపై సుప్రీం సీరియస్-నోటీసుల జారీ
ఏపీలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తులో దూకుడుగా వెళ్తున్న సీబీఐ అధికారుల్ని నిందితులు బెదిరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గంగిరెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల్ని బెదిరిస్తున్నారని, అలాగే సాక్ష్యుల్ని కూడా బెదిరిస్తున్నారని దర్యాప్తు సంస్ధ ఆరోపించింది. దీంతో సుప్రీంకోర్టు ఎర్ర గంగిరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్ష్యుల ప్రాణాలకు ముప్పు ఉందన్న సీబీఐ వాదనపైనా సుప్రీంకోర్టు స్పందించింది.

వివేకా హత్య కేసు నిందితుడైన ఎర్ర గంగిరెడ్డికి సీబీఐ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సీబీఐపై ఆరోపణలు చేస్తూ పోలీసుల్ని కూడా ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు కూడా గతంలో సీరియస్ అయింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై తదుపరి చర్యల్ని నిలిపేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఇదే అంశంపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో తదుపరి సీబీఐ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.