Rajadhani Files: రాజధాని ఫైల్స్ చిత్రానికి హైకోర్టు బ్రేక్- విడుదలపై స్టే ..
ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం విడుదల నిలిపేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. రేపు మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపి హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.
ఏపీలో అమరావతి స్ధానంలో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ స్ధానిక రైతులు ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువన్ వెబ్ సైట్ కు చెందిన నిర్మాణ సంస్ధ ఈ పోరాటాన్ని రాజధాని ఫైల్స్ పేరుతో తెరకెక్కించింది.

ఇందులో సీఎం జగన్, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్ తో పాటు పలు పాత్రలు ఉన్నాయి. వీటిలో కొడాలి నాని సహా పలు పాత్రల్ని అనుచితంగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
అయితే సెన్సార్ బోర్డు రాజధాని ఫైల్స్ చిత్రంలో పలు సీన్లు తొలగించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు వాటిని ఇప్పటికే తొలగించినట్లు చిత్ర నిర్మాతల తరఫు లాయర్ వాదించారు. సెన్సార్ బోర్డు అభ్యంతరాల తర్వాత రివ్యూ కమిటీ తిరిగి సర్టిఫికెట్ జారీ చేసిందని తెలిపారు. అయితే వాదనలు విన్న హైకోర్టు.. రేపటి వరకూ ఈ చిత్రం విడుదలపై స్టే మంజూరు చేసింది. రేపు వాదనల తర్వాత తుది నిర్ణయం ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications