AP Election: ఏపీ ఎన్నికల్లో హింసపై ఈసీ సీరియస్ ! హౌస్ అరెస్టులు, కేసులకు ఆదేశం..!
ఏపీలో ఇవాళ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసపై ఈసీ సీరియస్ అయింది. ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురంలో చోటు చేసుకున్న హింసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ హింసకు కారణమైన వారిని వెంటనే హౌస్ అరెస్టు చేయాలని, అలాగే కేసులు కూడా నమోదు చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఈసీ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాష్ట్రంలోని తెనాలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ బూత్ లో ఓటరుపై దాడిని సీరియస్ గా తీసుకున్న ఈసీ.. ఇవాళ పోలింగ్ ముగిసేవరకూ సదరు ఎమ్మెల్యే అభ్యర్ధిని హౌస్ అరెస్టులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు.
అలాగే మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాళ్లు, రాడ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వాహనాలు కూడా ధ్వంసం చేసుకున్నారు. ఈ ఘటనలపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడిని కూడా హౌస్ అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
మరోవైపు అనంతపురం జిల్లా తాడపత్రిలోనూ జేసీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. వీటిని నియంత్రించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ హింసపైనా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్ధితుల్ని అదుపులోకి తీసుకురావడంతో పాటు వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అలాగే పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సాయంత్రం 4- 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈసీ హెచ్చరికలు చేస్తున్నా.. కృష్ణాజిల్లా పెనమలూరులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications