తెలుగు రాష్ట్రాల మధ్య వీకెండ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఈ వారాంతంలో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వారాంతంలో వరుసగా సెలవులు రావడంతో రైళ్లలో సీట్లు దొరక్క ఇబ్బందిపడుతున్న వారికి ప్రత్యేకంగా శుభవార్త లభించింది. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వారాంతంలో ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో సికింద్రాబాద్, నరసాపురం, కాకినాడ, తిరుపతికి ప్రయాణించే మొత్తం 8 రైళ్లు ఉన్నాయి.

ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 మధ్య ఈ ప్రత్యేక రైళ్లు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించబోతున్నాయి. ఇందులో కాచిగూడ-తిరుపతి ప్రత్యేక రైలు ఆగస్టు 16న ప్రయాణించనుంది. ఆగస్టు 16న రాత్రి 10.30కి కాచిగూడలో బయలుదేరే ఈ రైలు ఆగస్టు 17న ఉదయం 10.25కి తిరుపతి చేరుకుంటుంది. అలాగే ఆగస్టు 17న తిరుపతిలో రాత్రి 7.50కి బయలుదేరే రైలు ఆగస్టు 18న ఉదయం 9.30కి కాచిగూడ చేరుకుంటుంది. ఆగస్టు 17, 19 తేదీల్లో కాకినాడ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరే మరో రెండు రైళ్లు.. ఆ తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి.
సికింద్రాబాద్ లో ఆగస్టు 18, 20 తేదీల్లో సాయంత్రం 6.20కి బయలుదేరే రెండు ప్రత్యేక రైళ్లు.. తర్వాతి రోజు ఉదయం 6.30కి కాకినాడకు చేరుకుంటాయి. అలాగే ఆగస్టు 18న రాత్రి నరసాపురంలో బయలుదేరే ప్రత్యేక రైలు ఆగస్టు 19న ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆగస్టు 19న సికింద్రాబాద్ లో సాయంత్రం 6.20కి బయలుదేరే ప్రత్యేక రైలు తర్వాతి రోజు ఉదయం 5 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
మరోవైపు కాకినాడ నుంచి ఆగస్టు 18న సాయంత్రం 6.30కి బయలుదేరే ప్రత్యేక రైలు ఆగస్టు 19న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే ఆగస్టు 19న రాత్రి 9 గంటలలలకు సికింద్రాబాద్ లో బయలుదేరే రైలు తర్వాతి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications