కాకినాడ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- క్రిస్మస్, కొత్త ఏడాది వేళ..!
ఏపీలో కాకినాడ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఈ క్రిస్మస్ తో పాటు కొత్త సంవత్సరం సందర్బంగా ప్రయాణాలు చేసే వారికి ఇది శుభవార్త కానుంది. ఎందుకంటే ప్రస్తుతం పండుగల రద్దీ నేపథ్యంలో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. టికెట్లు దొరకట్లేదనే ఫిర్యాదుల పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్లపల్లి, కాకినాడ మధ్య ఈ సీజన్ కోసం ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటి తేదీలు, స్టాప్ లు ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
చర్లపల్లి నుంచి కాకినాడ, అలాగే కాకినాడ నుంచి చర్లపల్లికి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. చర్లపల్లి నుంచి కాకినాడకు ఈ నెల 24వతేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రతీ మంగళవారం, బుధవారాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఇవి సాయంత్రం 7.30కు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటాయి. అలాగే కాకినాడ టౌన్ నుంచి ఈ నెల 28 నుంచి 31 వరకూ ప్రతీ ఆదివారం, బుధవారాల్లో ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. ఇవి కాకినాడ టౌన్ నుంచి రాత్రి 7.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు చర్లపల్లి చేరుకుంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా నల్లొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతాయి. అలాగే వీటిలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఈ మార్గంలో ప్రయాణాలు చేసే వారు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications