కల్తీ మద్యం స్కాం వెనుక వారే ? కేతిరెడ్డి సంచలనం- జోగి చేసిందిదే..!
ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం కలకలం రేపుతున్న వేళ వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇవాళ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కల్తీ మద్యం వ్యవహారం వెనుక వైసీపీ నేత జోగి రమేశ్ ఉన్నారంటూ ఈ కేసులో నిందితుడు విడుదల చేసిన వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు. అసలు కల్తీ మద్యం వెనుక ఉన్నదెవరో ఆయన తేల్చిచెప్పేశారు. అలాగే జోగి రమేశ్ పాత్రపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నకిలీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదన్నారు. కాబట్టి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిందేనన్నారు. నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని, అందుకే పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రెండు నెలల క్రితమే కల్తీ మద్యం తయారీ ప్రారంభమైందని ఎక్సైజ్ అధికారులు చెప్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం రెండున్నరేళ్ల క్రితమే మొదలైందని అబద్దాలు చెప్తున్నారన్నారు.

వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా బయటపెట్టింది తమ పార్టీ నేత జోగి రమేషే అని కేతిరెడ్డి తెలిపారు. నారా వారి సారా అంటు నకిలీ మద్యం నిల్వలు బట్టబయలు చేశారన్నారు. దీంతో జోగి రమేష్ పై కక్ష కట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆయన్ను ఇరికించేందుకు వీడియో లీక్ చేయించిందన్నారు. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోణపలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్దమని జోగి రమేష్ ప్రకటించారని, అయినా చంద్రబాబు, లోకేష్ లు స్పందించడం లేదన్నారు.

చంద్రబాబు చేసేది బురద చల్లుడు రాజకీయమేనని, కట్టుకథలతో ఎన్టీఆర్ లాంటోడినే నాశనం చేశారని కేతిరెడ్డి మండిపడ్డారు.
కస్టడిలో ఉన్న జనార్ధన్ వీడియో ఎలా బయటకు వచ్చింది?ఎవరు రికార్డు చేశారని ఆయన ప్రశ్నించారు. సిట్ విచారణ చేస్తుందా? వీడియో లీకులు ఇస్తుందా అని నిలదీశారు. మరోవైపు ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం దొరికితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు.












Click it and Unblock the Notifications