Amaravati: అమరావతి వ్యవహారం తేల్చబోతున్న సుప్రీంకోర్టు ! సెప్టెంబర్ 1 న ముహుర్తం..
అమరావతి రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. దీంతో రాష్ట్రంలో అధికార వైసీపీ, విపక్షాల మధ్య తీవ్ర పోరు సాగుతోంది. ముఖ్యంగా ఆర్ 5 జోన్ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపింది. ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్ధలాల కేటాయింపుకు గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సరేనన్నాయి. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడే ఉండాలని స్పష్టం చేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిలో ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో హైకోర్టు దాన్ని అడ్డుకుంది.
ఈ నేపథ్యంలో అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేసి అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 1న విచారణ జరపాలని నిర్ణయించింది. అదే రోజు ఆర్ 5 జోన్ పై మిగిలిన పిటిషన్లను కూడా విచారించబోతోంది. దీంతో సెప్టెంబర్ 1న జరిగే విచారణ కీలకంగా మారింది.

అమరావతి ఆర్ 5 వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తమ వాదన వినకుండా తుది తీర్పు ప్రకటించవద్దని కోరుతూ అమరావతి రైతులు అత్యున్నత న్యాయస్ధానాన్ని కోరారు. ఈ మేరకు అమరావతి రైతులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రైతుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో పార్టీలుగా చేర్చి సుప్రీంకోర్టు దీని విచారణ జరపబోతోంది.
మరోవైపు సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిని మార్చడంపై దాఖలైన అసలు పిటిషన్లను విచారణ జరుపుతున్న జస్టిస్ సంజయ్ ఖన్నా ధర్మాసనమే ఇప్పుడు అమరావతి ఆర్ 5 జోన్ పిటిషన్లను కూడా విచారించబోతోంది. అమరావతి వ్యవహారంపై ఆ ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులకు పూర్తి అవగాహన ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పు చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఎన్నికల్లోపు ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జగన్ సర్కార్ పట్టుదలగా ఉంది. కేంద్రం నిధులివ్వకపోయినా తామే స్వయంగా నిధులిచ్చి వీటిని పూర్తి చేయించాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఈ కార్యక్రమం చేపట్టబోతంది.












Click it and Unblock the Notifications