బీజేపీ పిలిస్తేనే ఢిల్లీకి బాబు-అమిత్ షా, నడ్డాలతో భేటీపై అచ్చెన్నాయుడు ..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటివరకూ ఓవైపు తమతో పొత్తులో ఉంటూ టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించిన బీజేపీ.. ఇప్పుడు ఆయన మిత్రుడు చంద్రబాబును కూడా అక్కున చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఢిల్లీకి ఆహ్వానించింది. దీంతో చంద్రబాబు నిన్న అర్ధరాత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు.
అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్లక ముందు ఆయన పర్యటన గురించి చర్చ జరిగినా పెద్దగా విషయాలేమీ బయటికి రాలేదు. కానీ ఇవాళ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ వివరాల్ని వెల్లడించారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే వీరి భేటీలో ఏం జరిగిందో ఢిల్లీనుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు చెబుతారని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుపై స్పందిస్తూ తాము ఎవరితో పొత్తుపెట్టుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలకోసమే అన్నారు.
ఐదుకోట్ల ఆంధ్రుల ప్రయోజనమే తమకు ముఖ్యమన్నారు.

మరోవైపు ఇవాళ పవన్ కళ్యాణ్ కు కూడా ఢిల్లీ రావాలని ఆహ్వానం అందింది. దీంతో చంద్రబాబు, పవన్ తో మరోసారి అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమై పొత్తు, సీట్లపై ఫైనల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనట్లే. అయితే సీట్ల పంపకాల విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చల్లో టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకాలపై దాదాపు క్లారిటీ వచ్చింది. అయితే బీజేపీ కూడా చేరుతున్నందున వారికి కేటాయించే సీట్లు కూడా కలిపి ఒకేసారి ప్రకటించబోతున్నారు.












Click it and Unblock the Notifications