Ganta Srinivas: ఎట్టకేలకు గంటా శ్రీనివాస్ సీటు ఖరారు ...!
ఏపీలో టీడీపీ ఇప్పటివరకూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మూడు జాబితాలను విడుదల చేసింది. ఇందులో మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు మాత్రం సీటు దక్కలేదు. దీనికి ప్రధాన కారణం ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ సీటు బీజేపీకి ఇచ్చే ఉద్దేశంతో అధిష్టానం ఆయనకు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా కోరడమే. అయితే చీపురుపల్లి కాదని తన పాత సీటు భీమిలి కేటాయించాలని గంటా పట్టుబట్టారు.
అయితే గంటా శ్రీనివాస్ అంతగా పట్టుబడుతున్న భీమిలి సీటు విషయంలో టీడీపీ కూడా ఆలోచనలో పడింది. అయితే దీర్ఘకాలిక వ్యూహంతో చీపురుపల్లి నుంచి పోటీ చేయాలన్న టీడీపీ అధిష్టానం సూచనతో గంటా కూడా ఓ దశలో వెనక్కి తగ్గారు. అయితే విశాఖ పార్లమెంటు సీటు పరిధిలో ఒక్క కాపు అభ్యర్ధి కూడా లేకపోవడంతో తిరిగి గంటా పేరును భీమిలికి టీడీపీ పరిశీలించింది. ఈ మేరకు తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించారు. ఇందులో గంటాకు భీమిలిలో మంచి అవకాశాలు ఉన్నట్లు తేలింది.

దీంతో గంటా శ్రీనివాస్ కు భీమిలి సీటు కేటాయించేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఈ మేరకు గంటాకు కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భీమిలి సీటు కోసం పట్టుబట్టిన గంటా శ్రీనివాస్.. ఇప్పుడు మరోసారి అక్కడి నుంచి గెలిచి ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి కావాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ త్వరలో ప్రకటించే మిగిలిన నాలుగో జాబితాలో గంటా శ్రీనివాస్ పేరు ఉంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications