విజయసాయిరెడ్డిని సజ్జల అందుకే కొట్టారు..! బయటపెట్టిన కోటంరెడ్డి..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వీడి, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న విజయసాయిరెడ్డి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను వైసీపీలో ఉండగా ఓ సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనను కొట్టారని వెల్లడించారు. అయితే దాని వెనుక ఉన్న కారణం మాత్రం చెప్పలేదు. జగన్ సమక్షంలోనే ఇది జరిగినా, ఆయన స్పందించలేదంటూ బాంబు పేల్చారు. దీనిపై ఓవైపు తీవ్ర చర్చ జరుగుతుండగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఇవాళ దాని వెనుక ఉన్న కారణం ఏంటో బయటపెట్టారు.
విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా మంగళగిరిలో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయనను మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టడం నిజమేనని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. అయితే దీని వెనుక ఉన్న కారణం కూడా బయటపెట్టారు. అప్పట్లో వైసీపీ ప్లీనరీ వేదికపై ఎవరితో మాట్లాడించాలనే దానిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ రోజు ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి చివరికి విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టారని కోటంరెడ్డి పేర్కొన్నారు. సాయిరెడ్డి తనకు 72 అవమానాలు జరిగాయని చెప్పారని, కానీ తనకు తెలిసి మరో అవమానం కూడా ఆయనకు జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో సొంతూరు తాళ్లపూడి వచ్చినప్పుడు కాకుపల్లి సెంటర్లో వంద వాహనాలతో స్వాగతం పలికినందుకు.. సాయిరెడ్డిని సజ్జల నోటితో చెప్పలేని విధంగా తిట్టారన్నారు.

మరోవైపు రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వైసీపీ వికృత రాజకీయాలు చేస్తోందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వైసీపీ క్రెడిట్ చోరీ చూస్తుంటే, ప్రాజెక్టులన్నీ కట్టింది జగనే అని, దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా జగనే అని చెప్పేట్లు ఉన్నారంటూ కోటంరెడ్డి సెటైర్లు వేశారు. ఒకప్పుడు వైసీపీలో ఉంటూ చంద్రబాబుపై ఎప్పుడూ సెటైర్లు వేస్తూ, జగన్ ను పొగుడుతూ కనిపించిన శ్రీధర్ రెడ్డి.. ఆ తర్వాత మాత్రం యూటర్న్ తీసుకుని జగన్ కు గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో సాయిరెడ్డి వ్యాఖ్యల్ని బలపరిచేలా కోటంరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications