ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే
సహజంగా గెలిచిన అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి ఇంటికి వెళ్లి మాట్లాడడం ఇద్దరూ కలిసి ప్రజల అభ్యున్నతి కోసం నియోజకవర్గ ప్రగతి కోసం పనిచేయాలని చెప్పుకోవటం రాజకీయాలలో చాలా అరుదుగా జరిగే సంఘటన. ఇక అటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థి ఇంటికి వెళ్లి పలకరించారు ఓ ఎమ్మెల్యే.. ఇద్దరు కాసేపు నియోజకవర్గంలో చేయవలసిన పనుల గురించి ముచ్చటించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ప్రత్యర్థి ఇంటికి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యే
చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులు కూడా వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందేనని ఈ విషయం తెలిసిన ఏపీ ప్రజలు భావిస్తున్నారు.. అసలు ఇంతకు ఎవరు ఆ నాయకులు అంటే.. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఈరా లక్కప్ప ఇంటికి వెళ్లారు.

భేషజాలు లేకుండా కలిసిన టీడీపీ వైసీపీ నాయకులు
మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పర్యటించారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న పలారం గ్రామంలో మడకశిర వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఈరా లక్కప్ప ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎటువంటి బేషజాలు లేకుండా వీరిద్దరూ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు.
రాజకీయం ఎన్నికలప్పుడేనట
నేను గెలిచిన ఎమ్మెల్యేను.. అని అహంకారానికి ఎమ్మెస్ రాజు పోలేదు. నన్ను ఓడించిన వ్యక్తి ఇంటికి వస్తే మాట్లాడాలా అని ఈరా లక్కప్ప అనుకోలేదు. ఇద్దరు సామరస్య పూర్వకంగా మాట్లాడుకున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయం ప్రజల కోసం అంతా కలిసి పని చేస్తామని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చెబుతున్నారు. ఈరా లక్కప్పని కలవడం సంతోషంగా ఉందని, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సలహాలు తీసుకుంటానని ఎమ్మెస్ రాజు చెబుతున్నారు.
మడకశిరలో 351 ఓట్ల తేడాతో ఎమ్మెస్ రాజు విజయం
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో మడకశిర నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో అన్నదానిపైన కౌంటింగ్ రోజు తీవ్ర ఉత్కంఠ చోటుచేసుకుంది. చివరి రౌండ్ వరకు ఇరువురి మధ్య విజయం దోబూచులాడింది. ఫైనల్ గా కేవలం 351 ఓట్ల తేడాతో ఎమ్మెస్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈరా లక్కప్ప ఓటమి పాలయ్యారు.
చంద్రబాబు, జగన్ వాళ్ళను చూసి నేర్చుకోవాలి
ఏది ఏమైనా తాజా చర్యతో విభేదాలకు చెక్ పెడుతూ ఏపీ రాజకీయాలలో కొత్త సంస్కృతికి తెర తీశారు వీరు ఇరువురు.. ఇక ఈ విషయం తెలిసిన వాళ్లంతా వీళ్ళని చూసైనా చంద్రబాబు, జగన్ మారాలని ఒకరిపై ఒకరు 365 రోజులు రాజకీయాలు చేయడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications