నామినేషన్ వెయ్యకుండా అడ్డుకుని బలవంతపు ఏకగ్రీవం.. ఎస్ఈసికి ఫిర్యాదు చేసిన టీడీపీ బలపరిచిన అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు అనేక ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఒకపక్క మాటల యుద్ధం కొనసాగుతుండగానే, మరోపక్క బెదిరింపుల పర్వం కూడా చోటు చేసుకుంటుంది. వైసీపీ నేతలు టీడీపీ బలపరిచిన అభ్యర్థులను బెదిరిస్తున్నారని టీడీపీ , టీడీపీ దాడులకు , దౌర్జన్యాలకు దిగుతుందని వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలతో విమర్శలు గుప్పిస్తున్నారు . తాజాగా నామినేషన్ వేయకుండా తమను అడ్డుకున్నారంటూ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కందుల పాడు గ్రామ పంచాయితీ నుండి టిడిపి బలపరిచిన అభ్యర్థి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు.
ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయడానికి టిడిపి బలపరిచిన అభ్యర్థిగా పొందుగల చిలకమ్మ కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కందుల పాడు గ్రామపంచాయతీ నుండి ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నించారు. అయితే ఆమెను అడ్డుకున్న వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు గురి చేశారని, వైసిపి బలపరిచిన అభ్యర్థిని బలవంతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని అభ్యర్థి పొందుగల చిలకమ్మ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

టిడిపి నేతలతో కలిసి ఈరోజు ఎన్నికల సంఘం ఆఫీస్ కు వచ్చిన అభ్యర్థి చిలకమ్మ కందుల పాడు పంచాయతీ నామినేషన్ గడువును పొడిగించాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్ఈసి ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ నేపద్యంలో బలవంతపు ఏకగ్రీవం చేశారని ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు కందుల పాడు గ్రామానికి చెందిన ఒక అభ్యర్థి . గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో ఎన్నికల సంఘం అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications