వీడియో: విజయా డెయిరీ ఛైర్మన్‌కు భూమా అఖిల వార్నింగ్: హెరిటేజ్ ఛైర్మన్‌తో అలాగే మాట్లాడగలరా..!!
Bhuma Akhila Priya: అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు భూమా అఖిలప్రియ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ సారి ఆమె- నంద్యాల జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్నూలు జిల్లా విజయా డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డితో గొడవకు దిగారు. ఫోన్‌లో బెదిరించారు. నిజానికి- ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి భూమా అఖిలప్రియ కోడలి వరుస అవుతారు.
కర్నూలు జిల్లా విజయా డెయిరీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు పెట్టడం దీనికి కారణం. ప్రభుత్వం మారిన తరువాత కూడా అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఫొటోలు లేకపోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నంద్యాలలోని డెయిరీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎస్వీ జగన్ అక్కడ లేరు. దీనితో ఆమె ఆయన కుర్చీలో కూర్చున్నారు. అక్కడి నుంచే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ మారిన తరువాత కూడా జగన్ ఫొటోలు అక్కడ కనిపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించి చంద్రబాబు ఫొటోలు ఉంచారు.
తన కుర్చీలో కూర్చోవడం పట్ల ఎస్వీ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలా కూర్చుంటావని ప్రశ్నించారు. దీనితో ఆమె ఆగ్రహం పతాక స్థాయికి చేరింది. నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? అంటూ మండిపడ్డారు. తనను ప్రశ్నించడానికి ఎలాంటి అధికారం లేదంటూ భూమా అఖిల అన్నారు.
విజయ డైరీ చైర్మన్ కి భూమా అఖిలప్రియా మాస్ వార్నింగ్ ..!!#BhumaAkhilPriya #VijayaDaity #SVJaganmohanReddy #Allagadda #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/e1bAOQI2yN
— oneindiatelugu (@oneindiatelugu) October 16, 2024
విజయ డెయిరీని తనిఖీ చేయడానికి తనకు అధికారం లేదని ఎలా ప్రశ్నిస్తావంటూ నిలదీశారు అఖిల. అసలు తనకు ఎందుకు ఫోన్ చేశారని, గొడవ పడటానికేనా? అంటూ నిలదీశారు. మామగా ఇంటికి వస్తే మర్యాదలు చేస్తానని, విజయా డెయిరీ ఛైర్మన్‌గా వస్తే ఎలా మాట్లాడాలో తనకు బాగా తెలుసునని అన్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయా డెయిరీ ఛైర్మన్‌తో ఆమె ప్రవర్తించిన తీరు పట్ల నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఇదే తరహాలో దురుసుగా హెరిటేజ్ సంస్థ ఛైర్మన్‌తోనూ మాట్లాడగలరా? అంటూ ప్రశ్నిస్తోన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ గౌరవప్రద స్థానంలో ఉన్న వ్యక్తితో అలా మాట్లాడటం సరి కాదంటూ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications