
చంద్రబాబు ఇంటిని ముట్టడించిన వైసీపీ ; రాళ్ళ దాడి, లాఠీ చార్జ్ తో ఉద్రిక్తత : అయ్యన్న వ్యాఖ్యల చిచ్చు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కాస్త, భౌతిక దాడుల దాక వెళ్ళింది. ఏకంగా చంద్రబాబు ఇంటిని ముట్టడించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించడం, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ , టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల రచ్చ చిలికి చిలికి గాలివానగా మారి ఉద్రిక్తతకు కారణమైంది .భౌతికంగా దాడులు చేసుకునే దాకా వెళ్ళింది.
పల్నాటి పులి కోడెల.. జగన్ వేధింపులతోనే బలి, రెండో వర్ధంతి నాడు లోకేష్ తో పాటు టీడీపీ నేతల ఆక్రోశం

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా జోగి రమేష్ తో పాటు వైసీపీ చంద్రబాబు ఇంటి ముట్టడి
ఉండవల్లి లోని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిన్న మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద్ సంస్మరణ సభలో అయ్యన్నపాత్రుడు చెత్త పాలన చేసే చెత్త నా ... అని జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సహా పలువురు నేతలు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వైసీపీ జెండాలు, కర్రలతో చంద్రబాబు ఇంటి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన వైసీపీ నేతలు చంద్రబాబుకు, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

చంద్రబాబు ఇంటివద్ద టీడీపీ వైసీపీ తోపులాట, రాళ్ళ దాడి, లాఠీ చార్జ్ తో ఉద్రిక్తత
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో పాటు తోపులాటకు దిగారు. చంద్రబాబు ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేయడానికి లాఠీఛార్జి చేశారు. వైసీపీ ఎమ్మెల్యేతో పాటు వైసిపి నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటిని ముట్టడించటంతో టిడిపి నేతలు హుటాహుటిన చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వైసీపీ నేతలకు టిడిపి నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు బుద్ధ వెంకన్న, పట్టాభి తదితరులు చంద్రబాబు నివాసానికి చేరుకొని వైసీపీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య బుద్ధ వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు.

వైసీపీ గూండాల దాడి అంటూ టీడీపీ ధ్వజం .. జగన్ ఇల్లు ఇక్కడే అంటూ వార్నింగ్
ఆందోళనకారుల దాడిలో ఎమ్మెల్యే జోగి రమేష్ కారు అద్దం ధ్వంసమైంది.దీనిపై టీడీపీ మండిపడుతోంది. చంద్రబాబు ఇంట్లోకి వైసీపీ గుండాలు చొరబడి దాడి చేశారని అడ్డుకున్న టిడిపి నేతలపై రాళ్ళ దాడులకు పాల్పడ్డారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. టిడిపి కార్యకర్తల నేతలను లోపలికి నెట్టేస్తున్న పోలీసులు వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల తలలకు గాయాలైనా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. అంతేకాదు చంద్రబాబు గారి ఇంటికి తాడేపల్లి కొంప ఎంత దూరమో, తాడేపల్లి కొంప కూడా చంద్రబాబు గారి ఇంటికి అంతే దూరం. చంద్రబాబు గారు సంయమనం పాటించమన్నారు కాబట్టి ఆగుతున్నాం. గుర్తుంచుకో జగన్ రెడ్డి అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

జగన్ పై టీడీపీ నేతలను రెచ్చగొడుతున్న బాబు క్షమాపణ చెప్పాల్సిందే : జోగి రమేష్
ఇదిలా ఉంటే సీఎం జగన్ పై ఆయన పాత్ర చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే జోగి రమేష్ తో పాటు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి నేత చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని చంద్రబాబు ఇంటిని ముట్టడించిన వైసీపీ నేతలు చంద్రబాబు పై ధ్వజమెత్తారు టిడిపి నేతలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు గుండాలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ నిప్పులు చెరిగారు చంద్రబాబు కావాలనే తన పై రాళ్ళు వేయించారని తన కారు పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారని ధ్వజమెత్తారు. దమ్ముంటే చంద్రబాబు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.