శ్రీకాళహస్తి ఫిన్ కేర్ సంస్థలో చోరీ: 85లక్షల విలువైన ఆభరణాలు, 5లక్షల నగదు దోపీడీ
శ్రీకాళహస్తి పట్టణంలో భారీ చోరీ చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఈ దోపిడీలో 85 లక్షల విలువైన బంగారం, ఐదు లక్షల నగదును దోచుకెళ్లారు దోపిడి దొంగలు. ఆఫీసులో పని చేస్తున్న మహిళా క్లర్క్ కాళ్ళు, చేతులూ కట్టేసి మరీ చోరీకి పాల్పడ్డారు.
ఇక పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెద్ద మసీదు వీధిలో మూడు సంవత్సరాలుగా ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ను నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లి పోయిన తర్వాత, అక్కడ పని చేస్తున్న క్లర్క్ స్రవంతి తనకు ఆఫీసులో పూర్తి చెయ్యవలసిన అదనపు పనులు ఉండడంతో రాత్రి పదిన్నర గంటల వరకు పనులు చేసుకుంటూ ఆఫీసులోనే ఉన్నారు. కార్యాలయం లోపల ఆమె తన పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో లోనికి ప్రవేశించిన ముగ్గురు దుండగులు ఆమెను బెదిరించారు. నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి ఫిన్ కేర్ సంస్థలో ఉన్న 85లక్షల రూపాయల బంగారాన్ని, ఐదు లక్షల నగదును దోచుకెళ్లారు.

బంగారం, నగదును స్రవంతి లెక్కలు చూసుకుంటున్న క్రమంలో, దీన్ని పసిగట్టిన వారు లోనికి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో డీఎస్పీ విశ్వనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఫిన్ కేర్ సంస్థ సిబ్బందిని పిలిచి విచారించారు. అంతేకాదు పట్టణం వెలుపల వున్న అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
శ్రీకాళహస్తి ఫిన్ కేర్ సంస్థలో చోరీ: 85లక్షల విలువైన ఆభరణాలు, 5లక్షల నగదు దోపీడీ #Srikalahasti #stolen pic.twitter.com/GwGvnYrVor
— oneindiatelugu (@oneindiatelugu) May 27, 2022
ఇటీవల కాలంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న అనకాపల్లి గ్రామీణ బ్యాంకులో దోపిడీ చోటు చేసుకుంది. గ్రామీణ బ్యాంకులోకి చొరబడిన దుండగులు తుపాకీతో క్యాషియర్ ను బెదిరించి 3.30లక్షల రూపాయలను దోచుకువెళ్ళారు. ఈ ఘటన చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మళ్ళీ తాజాగా అలాంటి చోరీనే శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications