వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తిరుపతి, దర్శనం.. ప్యాకేజీలు - ఇక నుంచి కొత్తగా..!!
Tirumala: శ్రీవారి సన్నిధిలో మూడు ముళ్లతో ఒక్కటయ్యేందుకు కొత్త నిర్ణయాలు అమలు కానున్నాయి. చాలా మంది వివాహం తరువాత నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. తిరుమలలోనూ టీటీడీ నిర్వహించే కల్యాణ వేదిక వద్ద ఖర్చు లేకుండా వివాహ క్రతువును ముగించవచ్చు. అయితే, ఇప్పుడు కొత్త ప్రణాళికల మేరకు తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ గా మారనుంది. ఇందు కోసం టూరిజం దర్శనంతో సహా ఇతర వసతులతో కలిపి ప్యాకేజీలను టూరిజం శాఖ ఖరారు చేస్తోంది.
తిరుమల శ్రీవారి చెంత వివాహాలు చేసుకోవాలని ఎంతో మంది కోరుకుంటారు. తిరుమలతో పాటుగా శ్రీనివాసమంగాపురం, తిరుచానూరులోనూ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. తిరుమల కొండ పైన వివాహం జరిపే అవకాశం లేని వారు కొండ దిగువ వివాహాలు జరిపించి వధూ వరులకు శ్రీవారి దర్శనం చేయిస్తారు. కాగా.. తాజాగా సీఎం చంద్రబాబు నారావారిపల్లె పర్యటన సమయంలో తిరుపతిని వివాహ వేడుకలకు వేదిక (వెడ్డింగ్ డెస్టినేషన్)గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు.

కాగా.. తిరుచానూరులో దాదాపు 40 వరకు పైగా కల్యాణ మండపాలు ఉన్నాయి. తిరుపతిలో 20కి పైగా మండపాలు, 15కు పైగా హోటళ్లు ఉండగా.. పెళ్లిళ్ల సీజన్‌లో రెండు మూడు నెలలకు ముందే ఇవి బుకింగ్ అయిపోతుంటాయి. తొండవాడ, శ్రీనివాస మంగా పురం వంటి ప్రాంతాల్లోని కల్యాణ మండపాల్లోనూ పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈ మధ్య కాలంలో తిరుపతిలో పెళ్లిళ్లను భారీ బడ్జెట్ తో స్టార్ హోటళ్లలో నిర్వహిస్తున్నారు.
కాగా, తిరుమలలోనూ టీటీడీ నిర్వహించే కల్యాణ వేదిక వద్ద ఎలాంటి ఖర్చు లేకుండానే వివాహాలు చేస్తారు. అయితే ఆర్భాటాలకు అవకాశం ఉండదు. కొండ పైన ఉన్న మఠాలు, మండపాలు, కల్యాణ వేదికల్లో రిజర్వేషన్ చేసుకొని వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. అయితే, వీరికి శ్రీవారికి దర్శనం.. వసతి వంటివి కల్పిస్తే మరింతగా వివాహాలు చేసుకునే వారికి వెసులుబాటు ఉంటుంది. తాజా ప్రతిపాదనలతో టూరిజం శాఖ ముందుకొస్తోంది.
అందులో భాగంగా వివాహాలు తిరుపతిలో చేసుకొవాలనుకొన వారికి డెకరేషన్, క్యాటరింగ్, రవాణా, వసతి వంటికి గుర్తింపు పొందిన టూరిజం సర్వీసు ప్రొవైడర్ల నుంచి అందిస్తారు. వారికి కావాల్సిన విధంగా కల్యాణ వేదికలు.. దర్శనం అవకాశం కల్పిస్తారు. ఇందు కోసం అందరికీ అనుకూలంగా ఉండే విధంగా రెండు రోజులకు వీలుగా ప్యాకేజీ ధరలను ఫిక్స్ చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications