తిరుమలలో స్వామివారి బంగారు కవచాన్ని తొలగించే అరుదైన ఘట్టం
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 88,257 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 45,068 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.68 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజుల పాటు శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఈ అభిషేకం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం మహోత్సవాన్ని చేపట్టనుంది టీటీడీ. ఈ క్రతువును అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు.
మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.
ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications