తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి టీటీడీ బిగ్ అలెర్ట్!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపైన కొలువైన దేవదేవుడు ఆ శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి దేశ విదేశాల నుండి ఎంతో మంది ప్రతీ రోజూ తిరుమలకు వెళ్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయమే కాదు, వెంకన్న కొలువై ఉన్న శేషాచలం కొండలు కూడా మహా మహిమాన్వితమైనవి. అటువంటి తిరుమల శేషాచల కొండల్లో ముక్తిపద తీర్థాలు కూడా ఉన్నాయి.
డిసెంబర్ 12న చక్ర తీర్థ ముక్కోటి పండుగ
వరాహ పురాణం ప్రకారం శేషాచల శ్రేణులలోని ఏడు ప్రధాన "ముక్తిప్రద" తీర్థాలలో చక్ర తీర్థం అత్యంత ప్రముఖమైనదిగా పరిగణించబడుతుంది.అటువంటి చక్ర తీర్థ ముక్కోటి పండుగకు సమయం ఆసన్నమవుతుంది. దీనికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. చక్రతీర్థ ముక్కోటి డిసెంబర్ 12 న నిర్వహించబడుతుంది. దీనిని తమిళ కార్తీక మాసం ప్రకారం నిర్వహిస్తారు.

శేషాచల అడవుల్లో చక్ర తీర్థ ముక్కోటి
తమిళ కార్తీక మాసం ప్రకారం, ప్రతి సంవత్సరం శుద్ధ ద్వాదశి రోజున చక్ర తీర్థ ముక్కోటి కార్యక్రమం జరుపుకుంటారు. పవిత్ర చక్ర తీర్థం శ్రీవారి ఆలయానికి దక్షిణ దిశలో కొన్ని మైళ్ల దూరంలో శేషాచల శ్రేణులలో పచ్చని అటవీ ప్రాంతంలో ఉంది. ఈ చక్ర తీర్థానికి చాలా విశేషం ఉంది.
చక్ర తీర్థ ముక్కోటి నాడు ప్రత్యేక పూజలు
చక్ర తీర్థ ముక్కోటి నాడు అక్కడ అ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు రాతి కొండపై చెక్కబడిన శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అభిషేకాలు నిర్వహించి, అనంతరం ప్రసాదాలు పంపిణీ చేస్తారు.పురాణాల ప్రకారం చక్ర తీర్థానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
చక్రాయుధాన్ని వదిలి వెళ్ళిన ప్రదేశం
శ్రీనివాసుడు తన చక్రాయుధాన్ని ఈ ప్రదేశంలో విడిచి వెళ్ళాడని అందుకే ఇది చక్ర తీర్ధం అయ్యిందని చెప్తారు. చక్రతీర్థం వద్ద 12 సంవత్సరాలు తపస్సు చేస్తున్న ఒక ఋషిపై రాక్షసుడు దాడి చేసినప్పుడు తన చక్రాయుధాన్ని పంపి రాక్షసుడిని సంహరించాడు శ్రీనివాసుడు. తరువాత భగవంతుడు ఋషి యొక్క అభ్యర్థనపై సద్గురువులను కాపాడటానికి తన అత్యంత శక్తివంతమైన చక్రాయుధాన్ని అదే ప్రదేశంలో విడిచిపెట్టాడు.
చక్ర తీర్థ ముక్కోటి నాడు భక్తుల సందడి
అందువల్ల ఆ ప్రవాహానికి చక్ర తీర్థం అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఈ తీర్థంలో ప్రతీ సంవత్సరం తమిళ కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు చక్ర తీర్థ ముక్కోటి నిర్వహించి పూజలు చేస్తారు. శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్న చక్ర తీర్థానికి ముక్కోటి నాడు భక్తులు విశేషంగా వెళ్లి అక్కడ పూజలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications