అయోధ్యలో తిరుమల శ్రీవారి లడ్డూలను వితరణ చేసిన టీటీడీ చైర్మన్ భూమన!!
అయోధ్యలో జరిగిన శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు . విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అయోధ్య రామ మందిర ట్రస్ట్ సభ్యులతో టిటిడి చైర్మన్ కాసేపు ముచ్చటించారు. అలాగే తిరుమల నుంచి రెండు రోజుల క్రితమే తీసుకెళ్లిన లక్ష లడ్డూలను అయోధ్యలో భక్తులకు పంపిణీ చేశారు.
శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని అన్నారు. కలియుగంలో తిరుమలలో స్వయం భువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగంలో శ్రీ రామచంద్ర మూర్తి అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామమందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరించిన వారికి, ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చైర్మన్ కోరుకున్నారు. అయోధ్య రామాలయం భక్తజనంతో విరాజిల్లాలని కరుణాకరరెడ్డి ఆకాంక్షించారు.
అయోధ్యలో నేడు రామమందిర ప్రారంభోత్సవం లో పాల్గొనడానికి టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి నిన్ననే అయోధ్యకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిరం వద్ద భూమన కరుణాకరరెడ్డికి రామమందిర ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కరుణాకరరెడ్డి రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ముందస్తు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుండి అయోధ్యకు చేరుకున్న కళాకారులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులతో చైర్మన్ కరుణాకరరెడ్డి మాట్లాడారు. రామమందిర ప్రారంభ సంబరంలో పాల్గొనడానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన లక్ష లడ్డూలను చైర్మన్ కరుణాకరరెడ్డి రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు అందజేశారు. నేడు తిరుమల శ్రీవారి లడ్డూలను ట్రస్ట్ సభ్యులతో కలిసి అయోధ్యలో పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications