TTD: రథసప్తమి వేడుకల వేళ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!!
ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పురస్కరించుకొని టిటిడి స్థానిక ఆలయాలలో కూడా వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోనూ, తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం లోనూ వేడుకలు జరపనున్నారు.
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయంలోనూ, శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం తదితర ఆలయాలలోనూ రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు టిటిడి స్థానిక ఆలయాలలో ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే టిటిడి స్థానిక ఆలయాలలోనూ రథసప్తమి నాడు వాహన సేవలు, విశేష పూజలు కొనసాగనున్నాయి. తిరుమలలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారు అమ్మవార్లతో సహా సప్త వాహనాలపై ఊరేగి భక్తులను కరుణిస్తారు.
ఇక తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపు ఉదయం నుండి స్వామివారికి సూర్యప్రభ వాహనం, హంస వాహనం, అశ్వ వాహనం, గరుడ వాహనం, చిన్న శేష వాహనం, చంద్రప్రభ వాహనం, గజ వాహన సేవలను నిర్వహిస్తారు. స్వామివారు, అమ్మవార్ల సమేతంగా ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారు.
ఇదే సమయంలో ప్రస్తుతం తిరుమల రద్దీ విషయానికి వస్తే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లోని 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
బుధవారం స్వామివారిని 67,275 మంది భక్తులు దర్శించుకోగా.. 25,293 మంది తలనీలాలు సమర్పించారు . కాగా, భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. రేపు రథసప్తమి వేడుకల నేపథ్యంలో తిరుమలలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. తిరుమలలో రథసప్తమి ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications