TTD: అర్ధ బ్రహ్మోత్సవానికి విస్తృత ఏర్పాట్లు... ఆరోజు పలు సేవలు; ప్రత్యేక దర్శనాలు రద్దు!!
అర్థ బ్రహ్మోత్సవం నిర్వహించడానికి టిటిడి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీన సూర్య జయంతి రథసప్తమి నాడు, స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనుండడంతో దీనిని అర్థ బ్రహ్మోత్సవం అంటారు. ఒకే రోజు బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. ఫిబ్రవరి 16వ తేదీన సూర్య జయంతి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించనున్నారు. ఈ మేరకు టిటిడి అన్ని ఏర్పాట్లను చేస్తుంది.
ఫిబ్రవరి 16వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ఆరోజు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయబడ్డాయి. సామాన్య భక్తుల సౌకర్యం కోసం ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లు జారీ ఉండదు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.

అంతేకాదు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైం స్లాట్ లను పాటించని పక్షంలో భక్తులతో కలిపి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి పంపుతామని టీటీడీ వెల్లడించింది. ఇక అర్థ బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమాడ వీధులలో ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ పేర్కొంది.

ఇప్పటికే ఏపీలో ఎండలు మండుతున్న క్రమంలో, భక్తులకు ఎండ ఇబ్బందులు కలగకుండా అఖిలాండం వద్ద, తిరుమాడ వీధుల్లో అవసరమైన ప్రాంతాలలో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడ వీధులలో కూల్ పెయింటింగ్ వేశారు. అందరినీ ఆకట్టుకునేలా రంగవల్లులతో తీర్చిదిద్దారు. ఇక అర్థ బ్రహ్మోత్సవం నాడు వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా ఆహారం, పానీయాలు అందించనున్నారు.

సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వంటి అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, టీ, కాఫీ, పాలు పంపిణీ చేస్తున్నామని టీటీడీ పేర్కొంది. రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications