TTD: నేటినుండి తిరుమలలో పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు; భక్తుల రద్దీ ఇలా!!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. నిన్న తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టిటిడి వెల్లడించింది.
ఇదిలా ఉంటే బుధవారం తిరుమల స్వామివారిని 65 వేల 683 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 117 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ౩.59 కోట్ల రూపాయలు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నేటి నుండి తిరుమలలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి.

టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఫిబ్రవరి 7న బుధవారం తిరుమలలోని కల్యాణవేదికలో రాత్రి 7 గంటలకు యువ కళాకారులతో "శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక" గోష్టిగానం నిర్వహించారు.
శ్రీ పురందరదాసు 4.75 లక్షలకు పైగా సంకీర్తనలు రచించారు. వీటిలో ప్రధానమైన తొమ్మిది సంకీర్తనలను దాదాపు 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్టిగానం చేశారు. నేటినుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో దీనిని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 11న తిరుమలలో అనంతాళ్వారు 970వ అవతారోత్సవం ఘనంగా నిర్వహించటం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతాళ్వారు 970వ అవతారోత్సవాన్ని ఫిబ్రవరి 11వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications