మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్ట్..సీఎం చంద్రబాబు, ఏడువేల నిర్వాసితుల వల్లే సాకారం!
మూడు దశాబ్దాల వెలిగొండ కల సాకారం కాబోతోందని, ఈ నెల 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతుందని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఆయన మంగళవారం రాత్రి ఫీడర్ కెనాల్ లో ముఖ్యమంత్రి ప్రారంభించే రెగ్యులేటర్ గేట్లు అమర్చే పనులను పరిశీలించారు.
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చే, ఘాట్, స్థూపం, సభా స్థలం ఏర్పాట్ల పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.నిర్వాసితుల కాలనీలను సందర్శించి, మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ కు, అధికారులకు పలు సూచనలు చేశారు. వెలిగొండ ప్రారంభోత్సవ వేళ చంద్రబాబుకి, నిర్వాసితులకు ఇక్కడి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. వెలిగొండ కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులందరికీ, పేరు పేరునా పాదాభివందనాలు చేస్తున్నామన్నారు.

7వేల నిర్వాసితుల కుటుంబాల త్యాగఫలితమే వెలిగొండ ప్రాజెక్ట్
7వేల నిర్వాసితుల కుటుంబాల త్యాగఫలితమే నేడు, లక్షలాది ఎకరాలకు సాగు, లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందబోతుందన్నారు. నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది. భవిష్యత్ లో వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం 5ఏళ్ళలో నిర్వాసితులను పచ్చి మోసం, దగా చేసిందన్నారు. వారికి వైసీపీ హయాంలో అన్యాయం జరిగిందన్నారు.
నిర్వాసితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం
నిర్వాసితులకు 900 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా, గత 5ఏళ్ళలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు 40 రోజుల్లోనే 768 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రతి గ్రీవెన్స్‌ని పరిశీలించి,అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా న్యాయం చేయమని చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు. వెలిగొండ నుండి నీళ్లు వస్తున్నందుకు రైతుల కళ్లల్లో ఆనందం ఎట్లానో, నిర్వాసితుల్లో కూడా అంతే ఆనందం ఉండాలనేది కూటమి ప్రభుత్వ తాపత్రయమని పేర్కొన్నారు.
ముంపు గ్రామాల ప్రజలకు రేషన్, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశం
బడులు, గుడులు, మసీదులు, కమ్యూనిటీ హాల్స్, పంచాయితీ ఆఫీసులు, సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ తో నిర్వాసితుల కాలనీలు రాత్రిళ్ళు సైతం విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా ఉన్నాయంటే గత టిడిపి ప్రభుత్వంలో చేసిన నిర్మాణాలే కారణమని ఆయన చెప్పారు. ముంపు గ్రామాల నిర్వాసితులు ఎక్కడ నివసిస్తున్నారో గుర్తించి రేషన్, పెన్షన్ వంటి వాటికి, ఎటువంటి ఆటంకం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.
నిర్వాసితులకు అండగా ఉంది చంద్రబాబు మాత్రమే
గత వైసిపి ప్రభుత్వం నిర్వాసిత కాలనీల్లో పెరిగిన తుప్పలను కూడా తొలగించలేదన్నారు .నాడు, నేడు నిర్వాసితులకు అండగా ఉంది చంద్రబాబు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
నిర్వాసిత కుటంబాలు సొంత ఇళ్ళుకట్టుకుని, గృహప్రవేశాలు చేసే వరకూ అధికారులు, నాయకులు అండగా ఉంటారని మంత్రి రామానాయుడు వారికి హామీ ఇచ్చారు. ముప్పై సంవత్సరాల కల నిజమవుతున్న వేళ సాగునీరు, తాగునీరు అందే జిల్లాల ప్రజల కళ్ళలో సంతోషం కనిపిస్తోందన్నారు.













Click it and Unblock the Notifications