నెల్లూరు రూరల్ లో జెన్ జీకి సీట్లు- వడపోత షురూ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ స్థానిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీట్ల పంపకాలపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో జెన్ జీని ఎన్నికల బరిలో దింపనున్నారు. నెల్లూరు రూరల్ లో మొత్తం 36 డివిజన్లు ఉండగా.. వీటిల్లో నాలుగింటిని కేటాయించాలని నిర్ణయించారు. ఆయా డివిజన్లల్లో జెన్ జీ అభ్యర్థుల వడపోత సైతం చేపట్టారు.

నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేయాలన్న తపన, రాజకీయాలపై ఆసక్తి, ప్రజా సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించడానికి అవసరమైన అవసరమైన వ్యూహాలు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, అనర్గళంగా మాట్లాడే జెన్ జీ యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డివిజన్ స్థాయి నుంచే రాజకీయాల్లో అవకాశాలను కల్పించడం ద్వారా జెన్ జీ యువత మున్ముందు మరిన్ని అద్భుతాలను సృష్టించగలదని విశ్వసిస్తోన్నారు కోటంరెడ్డి.
యువతరంలో చురుగ్గా రాజకీయ సమీకరణాల్లో అన్ని అర్హతలు ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయనున్నారు. ఈ నాలుగు డివిజన్లల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, ఇతరత్రా వ్యయాలను ఆయనే స్వయంగా భరించనున్నారు కూడా. వారికి అవసరమైన ప్రచార సామాగ్రిని కూడా సొంత ఖర్చులతో సమకూర్చుతారని తెలుస్తోంది. రాజకీయాల్లో జెన్ జీ యువతను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే కోటంరెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ నిర్ణయంతో నెల్లూరు రూరల్ లో రాజకీయ ఈక్వేషన్లు మారే అవకాశాలు లేకపోలేదు. ఏ డివిజన్ లో ఆశావహులకు గండి పడుతుందనేది తెలియని పరిస్థితి నెలకొంది. ఆ నాలుగు డివిజన్లల్లో తన అభ్యర్థులను దింపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెన్ జీ కి వ్యతిరేకం అనే ప్రచారాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లడానికి వీలు కలుగుతుందని కోటంరెడ్డి భావిస్తోన్నారు. రాజకీయ అవకాశాలను కల్పించడం ద్వారా అటు ఈ తరాన్ని ఆకట్టుకోవడం, వైఎస్ఆర్సీపీపై జెన్ జీ వ్యతిరేక ముద్ర వేసినట్టువుతుందనేది ఆయన వ్యూహంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
