కరిగిపోతున్న ఖండం.. 47 ఏళ్లలో 12 ట్రిలియన్ టన్నుల మంచు మాయం!
మన భూగోళానికి గుండెకాయ లాంటి గ్రీన్‌లాండ్, అంటార్కిటికా మంచు ఖండాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 47 ఏళ్ల వ్యవధిలోనే ఏకంగా 12.5 ట్రిలియన్ టన్నుల (దాదాపు 11.3 ట్రిలియన్ మెట్రిక్ టన్నులు) మంచు నీరై సముద్రాల్లో కలిసిపోయింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం శాటిలైట్ డేటా ఆధారంగా జరిపిన తాజా పరిశోధనలో ఈ భయంకరమైన సత్యం బయటపడింది. మన భూగోళంపై ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని విజ్ఞానశాస్త్ర జర్నల్ 'సైంటిఫిక్ డేటా' స్పష్టం చేసింది. అయితే గాల్లోని వేడి కంటే, ఉష్ణోగ్రత పెరిగిన సముద్రపు నీళ్లే కింద నుంచి, పక్కల నుంచి మంచు పొరలను కొరికేస్తూ వేగంగా కరిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సముద్ర మట్టాల పెంపు.. కోట్లాది మందికి వరద ముప్పు
కరిగిన ఈ మంచు అంతా కలసి దాదాపు 3 క్వాడ్రిలియన్ గ్యాలన్ల నీరుగా మారి సముద్రాల్లో చేరింది. ఫలితంగా 1979 నుంచి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం అంగుళం (3.1 సెంటీమీటర్లు) మేర పెరిగింది. ఇది వినడానికి చిన్న సంఖ్యలా అనిపించినా, దీని పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సముద్ర మట్టం కేవలం ఒక సెంటీమీటర్ పెరిగినా ప్రపంచవ్యాప్తంగా అదనంగా 20 నుంచి 30 లక్షల మంది ప్రజలు ప్రతి ఏటా వరద ముప్పునకు గురవుతారని అధ్యయనకర్త ఇనెస్ ఒటోసాకా వెల్లడించారు. గ్రీన్‌లాండ్‌లోని 'జాకోబ్‌షావ్న్' అనే హిమానీనాదం ప్రస్తుతం రోజుకు ఏకంగా 164 అడుగుల (50 మీటర్లు) చొప్పున వెనక్కి కరిగిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

2010 నుంచి ఊపందుకున్న కరుగుదల
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నాసా శాటిలైట్ల సాయంతో అంటార్కిటికాలో 1979 నుంచి, గ్రీన్‌లాండ్‌లో 1972 నుంచి ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించారు. 1970, 80ల కాలంలో మంచు కొండలు కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ, 2010 సంవత్సరం నుంచి కరిగే వేగం విపరీతంగా పెరిగినట్లు గుర్తించారు. భూగోళం వేడెక్కడం వల్ల వస్తున్న మార్పులు దశాబ్దాల తర్వాత స్పష్టంగా కనిపిస్తాయని, ఒకవేళ మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్‌ను పూర్తిగా అదుపు చేసినా, ఈ మంచు కరగడం రాబోయే అనేక దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముంచుకొస్తున్న ముప్పు.. ముందస్తు హెచ్చరికలు
అంటార్కిటికా తూర్పు ప్రాంతంలో కురిసిన అదనపు మంచు వల్ల పశ్చిమ ప్రాంతంలో జరిగిన నష్టం కొంతవరకు కవర్ అయినప్పటికీ, ఈ ఊరట తాత్కాలికమేనని సైంటిస్టులు అంటున్నారు. మంచు ఖండాలు వేగంగా పతనమయ్యే దిశగా పయనిస్తున్నాయనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. ఆధునిక విజ్ఞానంతో ముంచుకొస్తున్న ముప్పును ముందుగానే గ్రహిస్తున్న సమాజం, దానిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, తక్షణమే ప్రపంచ దేశాలు భద్రతా చర్యలు చేపట్లతో తీరప్రాంతాలు జలమయం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
