మనోళ్లు గురి పెడితే.. పతకం పడాల్సిందే: భారత్ హవా కంటిన్యూస్
ఆసియా గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతోంది. మహిళల 10 మీటర్ల షూటింగ్ ఈవెంట్ లో ఇప్పటికే వెండి పతకాన్ని సొంతం చేసుకుంది భారత్. ఇప్పుడు అదే కేటగిరీలో మరో వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత్ సత్తా చాటింది. రజత పతకాన్ని అందుకుంది. జపాన్ నగోయా షూటింగ్ గ్యాలరీలో కొద్దిసేపటి కిందటే ముగిసిన ఈ ఈవెంట్ లో భారత షూటర్లు రుద్రాంక్ష్ పాటిల్, హిమాన్షు థిల్లాన్, పార్థ్ మానేల త్రయం అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించింది.
ఈ ఈవెంట్‌లో భారత షూటర్ల బృందం మొత్తం 1890.1 పాయింట్లను సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా షూటర్లు షెంగ్ లిహావో, మా సిహాన్, జాంగ్ చాంగ్‌హాంగ్ టీమ్ 1899.0 పాయింట్లను సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో చైనా షూటర్లు క్వాలిఫికేషన్ రౌండ్‌లో ప్రపంచ రికార్డును నమోదు చేశారు. అలాంటి వారితో పోటీ ఉన్నప్పటికీ.. భారత షూటర్లు చివరి వరకు పట్టుదలతో పోరాడి రజతాన్ని అందుకున్నారు.

టీమ్ గా మాత్రమే కాకుండా వ్యక్తిగత విభాగంలోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు.. షూటర్లు. రుద్రాంక్ష్ పాటిల్, హిమాన్షు థిల్లాన్ వ్యక్తిగత ఫైనల్స్‌కు సైతం అర్హత సాధించారు. అర్హత రౌండ్‌లో రుద్రాంక్ష్ 631.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అలాగే హిమాన్షు థిల్లాన్ 630.0 పాయింట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మరో భారత షూటర్ పార్థ్ మానే మాత్రం 628.3 పాయింట్లు సాధించి 10వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ వ్యక్తిగత పోటీల క్వాలిఫికేషన్‌లో చైనాకు చెందిన స్టార్ షూటర్ షెంగ్ లిహావో 635.4 పాయింట్లతో ఆసియా గేమ్స్ క్వాలిఫికేషన్ రికార్డును నెలకొల్పాడు. చైనాకే చెందిన మాసిహాన్ 633.0 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. షూటింగ్ నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి ఇద్దరు మాత్రమే ఫైనల్‌కు వెళ్ళేందుకు అవకాశం లభిస్తుంది. ఈ నియమం వల్లే అయిదో స్థానంలో నిలిచిన చైనా షూటర్ జాంగ్ చాంగ్‌హాంగ్ టాప్ 8లో ఉన్నప్పటికీ తదుపరి క్వాలిఫికేషన్ అర్హతను దక్కించుకోలేకపోయాడు.
ఇతర విభాగాల్లో కూడా భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఫైనల్స్ రేస్ కు అర్హత సాధించాడు. టేబుల్ టెన్నిస్ గ్రూప్ మ్యాచ్‌లో భారత మహిళల బృందం తమ అద్భుత ఆటతీరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను మట్టికరిపించింది. తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది.












Click it and Unblock the Notifications
