మరో 10 రోజుల్లో రుతుపవనాలు ఖతం! శాటిలైట్ చిత్రాలతో ఐఎండీ షాకింగ్ రిపోర్ట్
భారతదేశానికి ప్రధాన నీటి ఆధారమైన నైరుతి రుతుపవనాల కాలం ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ నెల చివరికి వస్తున్నా దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు ఇంకా పూడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో, ఈసారి రుతుపవనాల సీజన్ లోటుతోనే ముగిసేలా కనిపిస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో వాయువ్య భారత్ నుంచి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీనివల్ల రాబోయే 10 రోజుల్లో కురిసే చిరుజల్లులతో ఈ లోటు పూడటం దాదాపు అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాధారణం కంటే తగ్గిపోయిన వానలు
వాతావరణ శాఖ సేకరించిన గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు దేశంలో సగటున 822 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 699.7 మిమీ వర్షం మాత్రమే కురిసింది. సీజన్ ప్రారంభంలో జూన్ మాసంలో తీవ్రమైన వర్షభావ పరిస్థితులు నెలకొనగా, జులై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. అయినప్పటికీ, ముగింపు దశలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో వర్షపాతం నమోదులో 15 శాతం గ్యాప్ అలానే మిగిలిపోయింది.

కొన్ని జిల్లాల్లో తేలికపాటి ఉపశమనం
రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో (NCR) ఇకపై భారీ వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని వాతావరణ మోడల్స్ సూచిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్య ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆయా రాష్ట్రాల రైతాంగానికి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం వర్షపాతం లోటును భర్తీ చేయడానికి ఈ వర్షాలు సరిపోవు. ప్రెజెంట్ పొజిషన్ చూస్తే రాజస్థాన్, పంజాబ్, హర్యానాతో పాటు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు సాధారణ స్థాయిలో కురిశాయి.
కౌంట్‌డౌన్ స్టార్ట్.. రాబోయే 10 రోజులే కీలకం!
ప్రస్తుతం ఉపగ్రహ చిత్రాల ప్రకారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మబ్బులు పట్టి ఉన్నప్పటికీ, అవి సుదీర్ఘకాలం కురిసే వర్షాలుగా మారే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఒకసారి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైతే, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం దాదాపు ముగిసినట్లే. కాకపోతే స్థానిక అల్పపీడనాలు లేదా వాతావరణంలో వచ్చే మార్పుల ఆధారంగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే వీలుంది. ఏది ఏమైనా, రాబోయే 10 రోజులు దేశ వాతావరణానికి అత్యంత కీలకమని, ఆ తర్వాత ఈ ఏడాది నైరుతి సీజన్ అధికారికంగా ముగియనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
