కంప్లీట్ కంట్రోల్ సాధించిన వ్లాదిమిర్ పుతిన్.. !!
రష్యా పార్లమెంటరీ ఎన్నికలలో అధికారిక యునైటెడ్ రష్యా పార్టీ తిరుగులేని మెజారిటీని అందుకుంది. అత్యంత స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది. ప్రారంభ ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకారం.. ఈ పార్టీ ఏకంగా 57.5 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. ఉక్రెయిన్‌పై సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకుంటున్న సైనిక చర్యల నిర్ణయాలకు ప్రజల నుండి లభిస్తున్న మద్దతుగా ఈ విజయాన్ని రష్యా ప్రభుత్వం ప్రచారం చేసుకునే అవకాశం ఉంది.
దేశంలో యుద్ధ వ్యతిరేక గళాలు వినిపించకుండా కఠినమైన చట్టాలు అమలు చేస్తున్న తరుణంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ పరిస్థితుల్లో యునైటెడ్ రష్యాకు ఎదురు లేకుండాపోయిందీ ఎన్నికల్లో. గట్టి ప్రతిపక్షం లేని వాతావరణంలో ఈ ఏకపక్ష విజయం నమోదు కావడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగిన తర్వాత రష్యాలో జరిగిన మొట్టమొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో అక్కడి ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం మీద అందరి దృష్టీ ఈ ఎన్నికల మీదే నిలిచింది. బలమైన ప్రతిపక్షం అంటూ ఏదీ లేకపోవడంతో అంచనాలకు తగ్గట్టే ఏకపక్షంగా మారాయి ఈ ఎన్నికలు. మొత్తం 450 స్థానాలు ఉన్న స్టేట్ డ్యూమాలో పాగా వేయడానికి కమ్యూనిస్టులు, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ రష్య, న్యూ పీపుల్ వంటి ఇతర పక్షాలు రేసులో ఉన్నప్పటికీ.. ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావాన్నిచూపలేకపోతున్నాయి. గట్టిపోటీ కూడా ఇవ్వట్లేదు.
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కూడా పెరిగింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార యునైటెడ్ రష్యా పార్టీకే మళ్లీ పట్టం కట్టారు. 2021 నాటి పార్లమెంట్ ఎన్నికలలో 51.72 శాతం మేర పోలింగ్ నమోదైంది. సుమారు 11 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు పేపర్ బ్యాలెట్లతో పాటు రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో ఓటు వేశారు. మాస్కోలో అత్యధిక పోలింగ్ నమోదైంది.
ఈ ఫలితాలపై రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడారు. ప్రజలు తమ పార్టీపై మళ్లీ నమ్మకాన్ని ఉంచారని వ్యాఖ్యానించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాంక్షించే రష్యన్ ఓటర్లందరూ తమ పార్టీకి మద్దతుగా నిలిచారని, అందుకే రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకోవడం దాదాపు ఖాయమైందని పేర్కొన్నారు. ఓటర్ల ఆకాంక్షలకు అనుగుణంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.
మరోవైపు రష్యా ఎన్నికల ఆన్‌లైన్ ఓటింగ్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున సైబర్ దాడులు చోటు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. వీటిని రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ధృవీకరించింది. విదేశీ శక్తులు హ్యాక్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. అయినప్పటికీ.. ఎక్కడా ఓటింగ్ ప్రక్రియకు అంతరాయం కలగలేదని వివరించింది. ఈ ఎన్నికలను బోగస్ గా అభివర్ణించింది. యాబ్లోకో పార్టీ. ఆ పార్టీ నాయకుడు నికోలాయ్ రిబాకోవ్ ''ఫర్ పీస్..'' అనే నినాదాన్ని వినిపించారు. ఆయన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ఇదే నినాదాన్ని బ్యాలెట్ పేపర్లపై రాశారు.














Click it and Unblock the Notifications
