న్యూఇయర్ వేళ విజయవాడలో కఠిన ఆంక్షలు..! ఫ్లైఓవర్ల మూత, రోడ్లపై ఇలా..!
విజయవాడలో కొత్త ఏడాది సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్న వారికి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలో ఈసారి జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ఇవాళ కీలక ప్రకటన చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసేయడంతో పాటు రహదారులపై జనం సంచారం విషయంలోనూ పలు ఆంక్షలు పెట్టారు.
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ నెల 31వ తేదీ రాత్రి కొత్త ఏడాది వేడుకల సందర్భంగా నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ రూల్ ను జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు.

అలాగే కొత్త ఏడాది వేడుకల పేరుతో యువత నగరంలోని రోడ్లపైకి వచ్చి కేక్స్ కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం వంటివి పూర్తిగా నిషేధించారు. ముఖ్యంగా యువత వేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

మరోవైపు కొత్త ఏడాది వేడుకల పేరుతో నగరంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఇందులో భాగంగా ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి, కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో తమ ఇళ్ల వద్దే జరుపుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications