విజయ్ సక్సెస్ వెనుక ఏపీ మాజీ సీఎం బావమరిది - ఆ నిర్ణయాలన్నీ ఆయన చేతిలోనే..!!
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను ఇచ్చిన హామీల అమలు కసరత్తును మొదలు పెట్టారు. ప్రతిపక్షాల పైన అప్పుడే అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. ఈ నెల 13న అసెంబ్లీ లో బల పరీక్ష నిరూపించుకునేందుకు సిద్దం అయ్యారు. ఇదే సమయంలో విజయ్ కోర్ టీంలో కీలకంగా మారిన ఏపీ మాజీ సీఎం బావమరిది గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఎవరీయన.. విజయ్ తో సాన్నిహిత్యం ఆసక్తిగా మారాయి.
తమిళనాడులో విజయ్ శకం మొదలైంది. ఊహించని విధంగా ఎన్నికల్లో ఫలితాలు సాధించిన విజయ్ వెనుక కోర్ టీం పని చేసింది. విజయ్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అధికారంలోకి రావటం.. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు చోటు చేసుకున్న రాజకీయం వేళ ప్రచారంలోకి వచ్చిన పేరు విష్ణురెడ్డి. విజయ్ కోర్ టీంలో కీలకంగా వ్యవహరించారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ను కలిసిన సమయంలో ఈ పేరు ప్రముఖంగా వినిపించింది. జన నాయగన్ నిర్మాతతో పాటుగా విజయ్ తో విష్ణురెడ్డి ఉండటంతో ఈ చర్చ కొనసాగించింది. ఏపీకి చెందిన ఈ విష్ణు రెడ్డిని గ్రానైట్ క్వారీల యజమానిగా చెబుతున్నారు. విష్ణు రెడ్డి పూర్తి పేరు ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. స్వస్థలం కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె. పదిహేనేళ్లుగా ఆయన గ్రానైట్ వ్యాపారం చేస్తూ చెన్నైలో ఉంటున్నారు. ఆయన తండ్రి రామనారాయణరెడ్డి అద్దవారిపల్లె సర్పంచ్‌గా, మహల్ ఎంపీటీసీ గా, కలికిరి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా పనిచేశారు.

విజయ్ వ్యవహారాల్లో కీలక పాత్ర
వీరి ఉమ్మడి కుటుంబం ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. రామనారాయణ రెడ్డి సతీమణి(విష్ణు తల్లి) స్వయానా కలికిరి మాజీ ఎంపీపీ నల్లారి ఆనంద రెడ్డి సోదరి. అంతేగాకుండా మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సోదరిని కూడా ఆ కుటుంబంలోని వారికే ఇచ్చి వివాహం చేశారు. మొత్తం మీద ప్రస్తుతం తమిళనాడు సీఎం శిబిరంలో ప్రధానమైన వ్యక్తిగా ప్రచారంలో ఉన్న విష్ణు రెడ్డి.. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత మండలానికే గాకుండా, కుటుంబానికి కూడా అత్యంత సమీప బంధువు(బావమరిది)గా చెబుతున్నారు. విష్ణు రెడ్డి విజయ్‌కు చాలా ఏళ్లుగా అత్యంత సన్నిహితుడని, టీవీకే పార్టీ కోసం.. ఆర్థిక వ్యవహారాల్లో సహాయకారి గా వ్యవహరించారు. విజయ్ సినిమాల పర్యవేక్షణ విషయాల్లో కూడా విష్ణు రెడ్డి చురుగ్గా పని చేసారని ప్రచారంలో ఉంది. దీంతో.. విష్ణురెడ్డి కి విజయ్ ఇస్తున్న ప్రాధాన్యత ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ పెద్ద ఎత్తున ఆసక్తి కర చర్చ జరుగుతోంది.













Click it and Unblock the Notifications