Vizag Airport: 15 నుంచి వైజాగ్ ఎయిర్ పోర్టు రాత్రిపూట మూసివేత-కారణమిదే !
ఏపీలోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వైజాగ్ ఎయిర్ పోర్టు తాత్కాలికంగా రాత్రి వేళల్లో మూతపడబోతోంది. రన్ వే మరమ్మత్తుల కారణంగా ఎయిర్ పోర్టును పగటి పూట మాత్రమే తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి పూట మాత్రం పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.
వైజాగ్ ఎయిర్ పోర్టులో రన్ వే కొన్ని రోజుల క్రితం దెబ్బతింది. దీంతో రన్ వేకు మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. ఈ పనుల కారణంగా ఎయిర్ పోర్టుకు రాకపోకలు సాగించే విమానాలపై ప్రభావం పడకుండా ఉండేదుకు రాత్రిపూట ఈ పనులు చేపట్టనున్నారు. దీంతో నవంబర్ 15 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ ఎయిర్ పోర్టును పూర్తిగా మూసి ఉంచాలని నిర్ణయించారు. ఈ వేళల్లో రన్ వే రిపేర్లు చేపట్టనున్నారు.

రన్ వే రిపేర్ల కారణంగా రాత్రిపూట వైజాగ్ ఎయిర్ పోర్టు మూత పడనుండటంతో పగటి పూట సర్వీసులు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎయిర్ పోర్టు నిర్వహణ చూస్తున్న తూర్పు నౌకాదళ అధికారులు అంగీకారం తెలిపారు. అలాగే రన్ వే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో రాత్రిపూట విమానాల రాకపోకల నిషేధంతో పాటు ఎయిర్ పోర్టు కూడా మూసి ఉంటుంది. కరోనా సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్టుకు రాకపోకలు కాస్త తగ్గినా తిరిగి కొంతకాలంగా పుంజుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications