Pithapuram: పవన్ కు ఎందుకు ఓటేయొద్దు ? పిఠాపురంలో జగన్ స్పీచ్ పై ఉత్కంఠ !
ఏపీలో ఈసారి ఎన్నికల్లో ఆసక్తిరేపుతున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ముందు వరుసలో ఉంది. గత ఎన్నికల్లో అరంగేట్రంలోనే రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలైన పవన్ కళ్యాణ్ ఈసారి ఇక్కడి నుంచి పోటీలో ఉండటమే దీనికి కారణం. ఈసారి పవన్ బోణీ కొడతారా లేదా అన్న ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుండగా.. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామంటూ ముద్రగడ వంటి వారు ఉరుముతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ పవన్ పై వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్లిన సీఎం జగన్ ఇవాళ తన చివరి రోజు ప్రచారంలో ఆయనకు జనం ఓటేయకుండా ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
గతంలో 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతితో పాటు పాలకొల్లులో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవిని ఓడించేందుకు అప్పటి సీఎం వైఎస్సార్ పక్కా వ్యూహాలతో ముందుకెళ్లారు. ఇప్పుడు సరిగ్గా ఆయన తనయుడు జగన్ ఎదుర్కొంటున్న పరిస్దితులనే ఆయన ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పాలకొల్లులో తొలిసారి కాంగ్రెస్ తరఫున బంగారు ఉషారాణిని నిలబెట్టిన వైఎస్.. చిరంజీవికి ఓటేయొద్దని అక్కడి ఓటర్లను కోరారు.

తాను పుట్టిన మొగల్తూరు ఉన్న పాలకొల్లు నియోజకవర్గానికి చిరంజీవి ఏం చేశాడో ఆలోచించాలని సీఎంగా వైఎస్సార్ అక్కడి ఓటర్లను కోరారు. అలాగే తన పథకాలు అందుతున్నాయో లేదో చూడాలన్నారు. ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చిన చిరంజీవికి ఓటేస్తారా లేక తన పథకాలు కొనసాగించే ఉషారాణికి ఓటేస్తారా అని ప్రశ్నించారు. దీంతో జనానికి ఈ వాదన నచ్చింది. సీన్ కట్ చేస్తే బంగారు ఉషారాణి చేతిలో అంతటి చిరంజీవి ఓటమిపాలయ్యారు. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గమే చిరును పట్టించుకోలేదు.
ఇప్పుడు జగన్ సైతం పవన్ కళ్యాణ్ ను ఎన్నికల ప్రచారంలో పదే పదే టార్గెట్ చేస్తున్నారు. పవన్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని, దత్తపుత్రుడని, నలుగురు భార్యలున్నారని ఇలా చాలా విమర్శలు చేశారు. అయితే ఇప్పటివరకూ పిఠాపురానికి వెళ్లని జగన్.. ప్రచారం ముగింపు వేళ అక్కడికి వెళ్లబోతున్నారు. పిఠాపురంలో భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగసభలో మాట్లాడబోతున్నారు. ఇందులో ఆయన ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా కాపు సామాజికవర్గం పవన్ వెంట ఉందనే ప్రచారం నేపథ్యంలో జగన్ ఆయన్ను ఓడించాలని పిఠాపురం ఓటర్లను ఏ వాదనతో కోరతోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని, అయినా ప్రయత్నిస్తానని చెప్పడం ద్వారా ఆ వర్గాన్ని ఆకట్టుకున్న జగన్.. ఈసారి వాటిపై ఏం చెప్పబోతున్నారనే చర్చ జరుగుతోంది. అలాగే పవన్ కు బదులు వంగా గీతకు ఓటేస్తే ఉండే ప్రయోజనాలను వివరించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications