ఇది ట్రైలర్ మాత్రమే; టీడీపీ జనసేన సీట్ల సిగపట్లపై ఎంపీ సాయిరెడ్డి సెటైర్లు!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పొత్తులతో వెళుతున్న తెలుగు దేశం పార్టీ , జనసేన మధ్య చోటు చేసుకున్న సీట్ల సిగపట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
మిత్ర ధర్మం మీద పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడం, టీడీపీపైన విమర్శలు చేయటం ఇదే సమయంలో బిజెపి సెంటిమెంట్ కోరడం వంటి పరిణామాలు రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి . టిడిపితో పొత్తు కొనసాగుతుందని చెబుతూనే మరోవైపు కచ్చితంగా మూడోవంతు సీట్లు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.

పొత్తు ధర్మాన్ని టిడిపి ఉల్లంఘించిందని, టిడిపి సీట్లు ప్రకటన చేసినట్టే, తాము కూడా సీట్లను ప్రకటిస్తున్నామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు వైసిపి చేతిలో ఆయుధంగా మారింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా టిడిపి జనసేన మధ్య కొనసాగుతున్న సీట్ల పంచాయతీ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
అసలు సీట్ల విషయంలోనే ఇద్దరూ చెరో దారిలో ప్రయాణం చేస్తుంటే ఈ పొత్తు ఎలా సక్సెస్ అవుతుంది అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఇలాంటివాల్లను ప్రజలెలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ఒకరినొకరు సంప్రదించకుండానే విపక్షాల కూటమి అభ్యర్థులను ప్రకటించడం వారి నుంచి ఏమి ఆశించవచ్చనేది ట్రైలర్ మాత్రమే అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ముందు ముందు సినిమా చాలా ఉంది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వారు తమ కూటమిని నిర్వహించలేకపోతే, వారిని రాష్ట్ర ప్రజలు ఎలా విశ్వసిస్తారు అంటూ ప్రశ్నించారు. ఏపీకి బలమైన, నిర్ణయాత్మకమైన మరియు ముందుచూపు ఉన్న ప్రభుత్వం అవసరం అని ఆయన పేర్కొన్నారు 2024లో వైఎస్ఆర్సిపి అలాంటి ప్రభుత్వాన్ని అందిస్తుందని విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ, జనసేనలకు అంత సీన్ లేదని ఆయన తన పోస్ట్ ద్వారా చెప్పారు.












Click it and Unblock the Notifications