Year Ender 2024: జనసేనకు లైఫ్-పవన్ కు ఎలివేషన్ ఇచ్చిన ఏడాది..!
ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా లబ్ది పొందిన రాజకీయ నేత, పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మాత్రమే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయి, తన పార్టీని సైతం కేవలం ఒక్క సీటుకే పరిమితం చేసుకున్న పవన్ కళ్యాణ్.. గత కొన్నేళ్లుగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఫలించాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ తో ఆయన లబ్ది పొందగా.. ఆయన కంటే ఎక్కువగా పవన్ , జనసేన లబ్ది పొందాయి. దీంతో ఈ ఏడాది జనసేనకు, పవన్ కు రాజకీయంగా ప్రాణం పోసినట్లయింది.
గతేడాది చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ఓ లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా పవన్ కళ్యాణ్, జనసేన పరిస్ధితి మారిపోయింది. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు కు ముందు వరకూ ఆయనతో కానీ, టీడీపీతో కానీ అంతగా టచ్ లో లేని పవన్ కళ్యాణ్.. ఆ ఒక్క ఘటనతో దూకుడుగా వ్యవహరించి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న పవన్ విమానాన్ని అడ్డుకున్న జగన్.. ఆ తర్వాత జనసేనానికి రోడ్డు మార్గాన కూడా ఎంటర్ కాకుండా అడ్డుకున్నారు. దీంతో మరింత పంతంగా ఏపీకి చేరుకుని చంద్రబాబును రాజమండ్రి జైలుకు వెళ్లి కలిశారు. అక్కడే టీడీపీతో పొత్తు కూడా ప్రకటించారు.

గతేడాది చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ జనసేనకూ, పవన్ కు ఈ ఏడాది బాగా కలిసొచ్చాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పాటు బీజేపీని కూడా దగ్గరకు తెచ్చి ఎన్డీయే కూటమిగా పోటీ చేయించిన పవన్ కళ్యాణ్ అనుకున్న ఫలితం సాధించారు. రాష్ట్రంలో తన బలాన్ని మించి సీట్లు తీసుకున్న పవన్ కల్యాణ్ దాని ప్రయోజనం సాధించారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లలోనూ జనసేనను గెలిపించి 100 స్ట్రైక్ రేట్ సాధించారు. దీంతో పవన్ పేరు దేశంలో మార్మోగిపోయింది. అలాగే ఎన్డీయేలోనూ పవన్ పలుకుబడి బాగా పెరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రచారం చేయడం ద్వారా పవన్ జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటుకుంటున్నారు.
ఇదంతా ఓ ఎత్తయితే ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రభావం చూపుతున్నారు. కూటమిగా పోటీ చేసి గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న పవన్ .. ఇప్పుడు తన అన్న నాగబాబును సైతం మంత్రి పదవి ఇప్పించుకునే స్థితికి చేరారు. సీఎం చంద్రబాబు సైతం ప్రభుత్వ వ్యవహారాలు, రాజకీయ అంశాలతో పాటు ప్రతీ అంశంలోనూ పవన్ కు ఎక్కడా ప్రయార్టీ తగ్గకుండా చూసుకుంటున్నారు. పవన్ సొంతంగా రాజకీయం చేసినా ఈ స్టేజ్ కు రావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications