పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకం- వీడియోలు బయటపెట్టిన జగన్- రీఎలెక్షన్ కు డిమాండ్..!
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి నిన్న జరిగిన ఎన్నికలే నిదర్శనమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్ధితులు ఉన్నాయనడానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలే నిదర్శనం అన్నారు. బూత్ ల్లో వైసీపీ ఏజెంట్లే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేశారన్నారు. సాక్ష్యాత్తు పోలీసులే బూత్ లోకి వెళ్లిన ఏజెంట్ల ఫామ్ లు చింపేసిన పరిస్ధితి దేశంలోనే ఎక్కడా ఉండదన్నారు. ఓటర్లను గుర్తించాల్సిన, ఓటర్ల జాబితాల్ని గుర్తించాల్సిన పోలింగ్ ఏజెంట్లనే లేకుండా చేశారన్నారు. పోలింగ్ ఏజెంట్లే లేకుండా ఎన్నికలు నిర్వహించడం ఎక్కడా చూడలేదన్నారు. అవి ఎన్నికలు ఎలా అవుతాయన్నారు.
ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్లు వీటిని ప్రశ్నించకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే అది బతకదన్నారు. ఎన్నికల ప్రక్రియ హాస్యాస్పదమవుతుందన్నారు. రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అజెండా ప్రజలకు మంచి చేయడం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కాదని, ప్రజల్ని పాలకులు మోసం చేస్తే ప్రశ్నించడం కాదని, దోచుకో పంచుకో తినుకో మాత్రమే అన్నారు. చంబల్ లోయలో బందిపోట్లను మించి చంద్రబాబు పులివెందుల ఓట్లు వేయించుకున్నారన్నారు. పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారన్నారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం ఉంటే, జనం ఓట్లేస్తారన్న నమ్మకం ఉంటే ఎన్నికలు రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలన్నారు.

నిన్న టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావుకు సమీప బంధువైన అనంతపురం డీఐడీ కోయ ప్రవీణ్ ఈ రెండు జడ్పీటీసీ ఉపఎన్నికల విషయంలో పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్తలా వ్యవహరించారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు మాట వినకపోతే పదుల సంఖ్యలో అధికారులు పోస్టింగ్ లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు అనుకూలమైన డీఐజీల ఆధ్వర్యంలో అవినీతి చేయిస్తున్నారన్నారు. మాఫియా బెల్ట్ షాపులు, అక్రమ ఇసుక, మట్టి మాఫియా, పేకాట క్లబ్బులు నడిపించేది వీరేనన్నారు.
పులివెందుల, ఒంటిమిట్టలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఓట్లు వేయకుండా పోలీసులు ఎలా అడ్డుకున్నారో, ఓటరు స్లిప్పుల్ని చింపేశారో మహిళలు ఆరోపిస్తున్న వీడియోల్ని జగన్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. అలాగే ఓట్లు వేయనివ్వాలంటూ మహిళలు పోలీసుల కాళ్లు పట్టుకున్న వీడియోల్ని సైతం ప్రదర్శించారు. కనంపల్లెలో ఓట్లు గల్లంతాయ్యాయని, తాము ఓటు వేయలేకపోయామంటూ మహిళలు ఆందోళన చేస్తున్న వీడియోను కూడా జగన్ చూపించారు. పులివెందుల జడ్పీటీసీ అభ్యర్ది హేమంత్ రెడ్డిని ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వని దృశ్యాల్ని కూడా జగన్ ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications