ఇక మీ గుండెకు జగనన్న హామీ..! త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం...
ఏపీలో గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటిగంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే STEMI ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన తొలి గంటలోపే అంటే గోల్డెన్ అవర్ లోపే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు అవకాశం ఉంది. దీంతో ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్దమవుతోంది.
అసంక్రమిక వ్యాధుల్లో గుండె సమస్యల వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఏపీలో ఇలాంటి మరణాలు 32% ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మంది ప్రజలు గుండెజబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటుకు గురై మరణించేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. మెడికల్ కాలేజీలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో హృద్రోగ చికిత్సల్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది.

గుండెపోటు వచ్చిన తొలి 40 నిమిషాల సమయంలో రోగికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే STEMI ముఖ్యోద్దేశ్యం. ఇందుకోసం ముందుగా గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించడం, సమీపంలోని PHCలలో ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచడం, గోల్డెన్ అవర్ లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ను ఉచితంగా రోగికి ఇవ్వడం, తర్వాత 100కి.మీల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న జిల్లా ఆస్పత్రికి తరలించి అవసరమైన టెస్టులు, ఆపరేషన్ చేయడం ఇందులో భాగం. ఇందుకోసం గ్రామస్ధాయిలో డాక్టర్లు,స్టాఫ్ కు శిక్షణ పూర్తయింది. రూ.120 కోట్లతో క్యాథ్ ల్యాబ్స్ ఏర్పాటు కూడా చేసింది.
గుంటూరు జీజీహెచ్, కర్నూలు జీజీహెచ్, విశాఖ జీజీహెచ్, వైజాగ్ కేజీహెచ్ నాలుగు చోట్ల హబ్స్ ఏర్పాటు చేసి ఈ జిల్లాల పరిధిలో గుండె సంబంధిత సేవల్ని ఇచ్చే 61 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో13, కర్నూలు 16, గుంటూరు 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో ANMలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వ్యవస్థతో గుండెపోటు లక్షణాలపై అవగాహన కల్పిస్తారు. గుండెపోటుకు వచ్చిన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్ కు తరలిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. తదనంతరం రోగిని క్యాథ్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పటల్ కు రిఫర్ చేస్తారు.

రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాథ్ ల్యాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు, టెక్నికల్ అసిస్టెంట్స్, ల్యాబ్ మరియు ఓటీ విభాగాల్లో రెగ్యులర్ మరియు కాంట్రాక్టు పద్ధతిలో 94 పోస్టులను సాంక్షన్ చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలు మరింత చేరువకానున్నాయి. STEMI పైలెట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 29న ప్రారంభిస్తారు. జనవరి 2024 నుండి STEMI ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు.












Click it and Unblock the Notifications