మోడీకి జగన్ అజెండా- దేశమంతా అమ్మఒడి, నిరుద్యోగభృతి-రాజ్యసభలో ప్రైవేటు బిల్లుల వెనుక ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో పాటు నిరుద్యోగ భృతిని కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ నిన్న రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు. ఏపీలో తాము అమలు చేస్తున్న పథకంతో పాటు మరో పథకాన్ని కూడా అమలు చేయాలని కేంద్రాన్ని కోరడం వెనుక కారణాలేంటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. జగన్ తన అజెండాలో అంశాల్ని మోడీని అమలు చేయాలని కోరడమేంటన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

ఏపీలో అమ్మఒడి పథకం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిల్లల్ల్ని స్కూళ్లకు పంపే తల్లులకు అమ్మఒడి పేరుతో ఏడాదికి రూ.15 వేల రూపాయలు ఇస్తోంది. రాష్ట్రంలో అక్షరాస్యత స్ధాయిల్ని పెంచేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా పిల్లల్ని పనుల్లోకి పంపే తల్లి తండ్రులకు ఊరట దక్కుతుందని చెబుతోంది. తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.15 వేలు ఇవ్వడం ద్వారా వారు ఆర్ధికంగా బలోపేతం అవుతారని, పిల్లల్ని పనిలోకి పంపకుండా చదువుకు పంపుతారని వైసీపీ సర్కార్ భావిస్తోంది. కొన్ని లోపాలున్నా ఈ పథకం ఇప్పుడు ఏపీలో విజయవంతంగా అమలవుతోంది.

నిరుద్యోగ భృతి పథకం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయకపోయినా అంతకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఈ హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని 2014లో టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక మాత్రం దీన్ని సక్రమంగా అమలుచేయలేదు. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఓ కారణమైంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని తెరపైకి తెస్తోంది.

రాజ్యసభలో సాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లులు
ఇప్పుడు అమ్మఒడితో పాటు నిరుద్యోగ భృతిని దేశమంతా అమలు చేయించేందుకు వీలుగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై రాజ్యసభ త్వరలో చర్చ చేపట్టబోతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రెండు పథకాలను దేశమంతా అమలు చేసేలా ఈ బిల్లులు వీలు కల్పించనున్నాయి. వీటికి రాజ్యసభ ఆమోదం లభిస్తే ఈ పథకాల అమలుకు కేంద్రం చర్యలు తీసుకునే వీలు కూడా ఉంది. దీంతో ఇప్పుడు వైసీపీ వేసిన ఎత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.

దేశమంతా అమలు సాధ్యమేనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో పాటు గతంలో టీడీపీ హామీ అయిన నిరుద్యోగ భృతిని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని వైసీపీ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్న హామీలు కూడా ఇలా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రాంతీయ పార్టీలు కేంద్రాన్ని కోరలేదు. కోరినా కేంద్రం పట్టించుకుంటుందన్న గ్యారంటీ లేదు. అటువంటప్పుడు వైసీపీ ఎందుకు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చిందనే దానిపై మిగతా పార్టీల్లో చర్చ జరుగుతోంది.

మోడీ నెత్తిన జగన్ అజెండా
ప్రస్తుతం వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో పాటు గతంలో టీడీపీ అమలు చేసిన నిరుద్యోగ భృతిని కేంద్రం అమలు చేయాలని కోరడం వెనుక ఆర్ధిక భారం నుంచి బయటపడాలనే ఉద్దేశం సీఎం జగన్ కు ఉందా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయాలని కోరడం ద్వారా భవిష్యిత్తులో ఏపీకి కూడా ప్రయోజనం ఉంటుందని వైసీపీ భావిస్తోందా అన్న చర్చ జరుగుతోంది. ఈ రెండూ కాదంటే మోడీని సైతం మిగతా పార్టీల ముందు ఇరుకునపెట్టేందుకే వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఈ డిమాండ్లను తెరపైకి తెచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కచ్చితంగా ఏదో ఒక కారణం లేకపోతే సాయిరెడ్డి వైసీపీ తరఫున ఈ డిమాండ్లను ప్రైవేటు బిల్లుల రూపంలో తెరపైకి తీసుకువాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications