వివేకా కేసులో మరో కీలక పరిణామం..! మళ్లీ సుప్రీంకోర్టులో బంతి..!
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయడంతో పాటు సీబీఐని మరోసారి లోతుగా దర్యాప్తుచేసేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. దీంతో ట్రయల్ కోర్టును దీనిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ మేరకు నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వివేకా హత్య కేసులో దాదాపు ఆరేళ్లకు పైగా సుదీర్ఘంగా సాగిన సీబీఐ దర్యాప్తులో ఏమీ తేల్చలేకపోయారు. అంతేగాకుండా దర్యాప్తు ముగిసిందంటూ సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక ఇచ్చింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన కుమార్తె ఈ కేసులో దర్యాప్తు మరింత లోతుగా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఆమెను ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పంపింది. దీంతో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు పాక్షిక సీబీఐ దర్యాప్తుకు అనుమతి ఇవ్వడం జరిగిపోయాయి. ఈ తీర్పుపైనా అసంతృప్తిగా ఉన్న సునీత ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీంతో వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ పూర్తి స్ధాయిలో దర్యాప్తు కొనసాగించాలా లేక నాంపల్లి కోర్టు చెప్పినట్లుగా ఒకటి రెండు అంశాలపై మాత్రమే దర్యాప్తు చేయాలా అన్న దానిపై మళ్లీ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో సునీత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వచ్చే మంగళవారానికి దీన్ని వాయిదా వేసింది. వచ్చే మంగళవారం సునీత దాఖలు చేసిన ప్రస్తుత పిటిషన్ తో పాటు పెండింగ్ లో ఉన్న ఇతర పిటిషన్లపైనా విచారణ చేపట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications