యువ లాయర్లకు అండగా.. వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
యువ లాయర్లకు అండగా.. వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ 2011 మంది లబ్ధిదారులకు 1. 55 కోట్ల నగదును వారి ఖాతాలలో జమ చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందడం కోసం కొత్త పథకాలను పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా పథకాలను కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా జూనియర్ న్యాయవాదులకు చేదోడువాదోడుగా ఉండడం కోసం, వారికి అండగా నిలవడం కోసం వైయస్సార్ లానేస్తం పథకాన్ని తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి గత మూడేళ్లుగా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.

జూనియర్ లాయర్లకు అండగా.. లా నేస్తం
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా నేడు జూనియర్ లాయర్ల ఖాతాలో నిధులను విడుదల చేశారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని చెప్పడం కోసమే లా నేస్తం పథకాన్ని తీసుకువచ్చామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువ న్యాయవాదులకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

నేడు లా నేస్తం నిధులు విడుదల చేసిన జగన్
ఈరోజు లానేస్తం పథకం నిధుల విడుదలలో భాగంగా 2011 మంది లబ్ధిదారులకు 1. 55 కోట్ల నగదును వారి ఖాతాలలో జమ చేశారు జగన్మోహన్ రెడ్డి. లా డిగ్రీ తీసుకున్న తర్వాత మూడేళ్ల పాటు యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకోవడం కోసం తామ అందిస్తున్న 5000 రూపాయల ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందన్నారు సీఎం జగన్.
న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ లా నేస్తం పథకం కింద 4,248 మందికి నిధులు విడుదల చేసినట్టుగా జగన్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం మూడున్నర సంవత్సరాలలో 35.40 కోట్ల రూపాయలను ఈ పథకం కింద అందజేసినట్టు జగన్ పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్ ను సైతం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
పాదయాత్ర హామీ నెరవేరుస్తున్న జగన్
కరోనా సమయంలో న్యాయ్యవాదుల కోసం ఈ కార్పస్ ఫండ్ నుంచి 25 కోట్ల నిధులను విడుదల చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అర్హులైన న్యాయవాదులకు రుణాలు ఇవ్వడానికి, భీమా సౌకర్యం కల్పించడానికి, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందించనున్నారు. అంతేకాదు పాదయాత్రలో హామీ ఇచ్చిన క్రమంలో ఈ లా నేస్తం పథకాన్ని ప్రారంభించిన జగన్ వారికి ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు.












Click it and Unblock the Notifications